కర్నూల్లో శవాలు మారాయి, కరోనా మృతుడికి బదులు..
ఏపీలో మరోసారి డాక్టర్ల నిర్లక్ష్యం బయటపడింది. గతంలో కరోనా నెగిటివ్ వ్యక్తికి బదులు పాజిటివ్ వ్యక్తిని డిశ్చార్జీ చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా కర్నూలులోనూ ఇలాంటి సంఘటనే చోటు చేసుంది. జీజీహెచ్ ఆస్పత్రిలో కరోనా వ్యక్తి మృతదేహానికి బదులు మరో వక్తి శవానికి అంత్యక్రియలు చేశారు. ఇది జరిగిన రెండు రోజుల వరకు కూడా గుర్తించలేకపోయారు. దీంతో వైద్య సిబ్బంది తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
గురువారపేటకు చెందిన రాంబాబు అనే వ్యక్తి ఈ నెల 6న ఆయాసంతో మరణించాడు. దీంతో అతని మృతదేహం నుంచి శాంపిల్స్ తీసుకొని పరీక్షలకు పంపించారు.రిపోర్ట్ వచ్చే వరకు మృతదేహాన్ని అక్కడే మార్చురీలో భద్రపరిచారు. ఇటీవల నెగిటివ్ అని తేలడంతో బంధువులను వచ్చి మృతదేహం తీసుకెళ్లాలని సూచించారు. బంధువు అక్కడికి చేరుకోగా కరోనా పాజిటివ్ వ్యక్తి మృతదేహాన్ని అప్పగించారు. దీంతో అసలు విషయం బయటపడింది. ఇద్దరి పేర్లు దాదాపుగా ఒకేలా ఉండటంతో డాక్టర్లు తికమకపడి ఇలా చేసి ఉంటారని ఆస్పత్రి వర్గాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేశాయి. రాంబాబు శవాన్ని తమకు అప్పగించాల్సిందేనని అతని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. కాగా కరోనా పేషెంట్ బాడీని అక్కడే వదిలిపెట్టి ఉంచడంతో కలవరం మొదలైంది. దాన్ని జాగ్రత్తగా ఖననం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.