ఈ నెల 19న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులోని శ్రీ కాల భైరవ స్వామి విగ్రహ ధ్వంసం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు ఎట్టుకేలకు నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు సత్తెనపల్లి రాజశేఖర్ అని, గోస్పాడు మండలం ఒంట వెలగల గ్రామానికి చెందినవాడిగా గుర్తించామని పోలీసులు తెలిపారు. అతన్ని విచారించగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడని చెప్పారు. ఈరోజు జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప సమక్షంలో నిందితుడిని మీడియా ముందు ప్రవేశ పెట్టారు. కాల బైరవ స్వామి ఆలయం తాళం పగులగొట్టి లోపలికి వెళ్లిన రాజశేఖర్ పూజలు చేశాడు. అనంతరం కాలబైరవ స్వామి అంగాన్ని ధ్వంసం చేసి, అంగ భాగంలో కొంత ఎత్తు కెళ్లాడు.
పూజకు వాడిన పూలమాల, బైక్ ద్వారా నిందితుడిని గుర్తించిన పోలీసులు అతణ్ని అరెస్ట్ చేశారు. కాలభైరవ స్వామి విగ్రహ అంగానికి పూజలు చేస్తే పిల్లలు పుడతారనే నమ్మకంతో రాజశేఖర్ విగ్రహ అంగాన్ని చోరీ చేసి.. ఇంటికి తీసుకెళ్లి రోజూ పూజలు నిర్వహిస్తున్నాడని గుర్తించారు. కొంతకాల క్రితం నిందితుడికి పెళ్ళి జరిగింది. అయితే అతనికి పిల్లలు కలగలేదు. కాలభైరవ స్వామి విగ్రహ అంగానికి పూజలు చేస్తే పిల్లలు పుడతారని అతనికి ఎవరో చెప్పారు. దీంతో అతను విగ్రహం అంగాన్ని చోరీ చేశాడని తెలిపారు. నిందితుడు రాజశేఖర్ సాధారణ వ్యక్తేనని, ఇందులో ఎటువంటి రాజకీయ ప్రమేయం లేదని ఎస్పీ ఫక్కిరప్ప స్పష్టంచేశారు.