డబ్బు భద్రంగా ఉంది.. ఖర్చు పెట్టేందుకు భార్య కావాలి - MicTv.in - Telugu News
mictv telugu

డబ్బు భద్రంగా ఉంది.. ఖర్చు పెట్టేందుకు భార్య కావాలి

November 9, 2022

ఈ మధ్య వ్యక్తులకు లాటరీ తగిలిన ఘటనలు ఎక్కువైపోతున్నాయి. అరబ్ దేశాలు, అమెరికా, ఇంగ్లండ్ వంటి దేశాల్లో సామాన్యులు సైతం ఈ దెబ్బతో కోటీశ్వరులైపోతున్నారు. అయితే లాటరీ గెలుచుకున్న వ్యక్తులు అప్పటివరకు చేస్తున్న పని మానేసి ప్రశాంతంగా జీవించాలనుకుంటారు. సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకోవడం కానీ, లేని వాళ్లకు దానం ఇవ్వడం కానీ చేస్తుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం విచిత్రంగా భార్య కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. జర్మనీకి చెందిన కుర్సాత్ యిల్డిరిమ్ అనే మామూలు కార్మికుడికి లాటరీలో ఇటీవల 82 కోట్లు తగిలాయి.

దాంతో ముందుగా చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి ఖరీదైన కార్లు, వాచీలు కొనేశాడు. కుర్సాత్ వయసు 41 ఏళ్లయినా ఇప్పటికీ బ్రహ్మచారిగానే ఉండిపోయాడు. ఇప్పుడు ఇంత డబ్బు రావడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని స్థానిక మీడియాకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. అమ్మాయి ఎలా ఉన్న పర్వాలేదు కానీ, ఏం జరిగినా తన వెంట నడిచే అమ్మాయి కావాలి. అలాగే ట్రావెలింగ్‌‌ని ఇష్టపడే అమ్మాయి అయితే బెటర్ అంటూ తన మనసులోని మాట చెప్పేశాడు. ఇంతేనా.. తాను భార్యను బాగా చూసుకోగలనని హామీ ఇస్తున్నాడు. గెలుచుకున్న డబ్బు భద్రంగా ఉంది. కానీ ఖర్చు పెట్టేందుకు భార్య కావాలని చిలిపిగా సమాధానమిస్తున్నాడు. తాను ఎక్కడి నుంచి వచ్చానో మర్చిపోనని, కొంత డబ్బును తోటి శ్రామికులకు దానంగా ఇచ్చానని చెప్పుకొచ్చాడు. అలాగే సోదరులకు, తల్లిదండ్రులకు కొంత ఆర్ధిక సాయం చేసినట్టు వివరించాడు. ఇక తానంటే అసూయ పడే వారి కోసమే ఖరీదైన కార్లు కొన్నానంటూ కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశాడు. మరి డబ్బుని చూసైనా ఎవరైనా అమ్మాయి ఇతనితో పెళ్లికి ముందుకు వస్తుందేమో చూడాలి.