కువైట్ బిగ్ షాక్.. విదేశీయుల్లో సగం మందిని ఇంటికి..  - MicTv.in - Telugu News
mictv telugu

కువైట్ బిగ్ షాక్.. విదేశీయుల్లో సగం మందిని ఇంటికి.. 

June 5, 2020

Kuwait Cut Expatriate Population

ఉపాధి కోసం పొట్టచేత పట్టుకొని కువైట్ వెళ్లిన వారికి ఆ దేశం పిడుగులాంటి వార్త చెప్పింది. కరోనా కారణంగా తమ దేశానికి వలస వచ్చిన వారిని తిరిగి వారి సొంత దేశాలకు పంపించి వేయాలని నిర్ణయించింది. వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో  ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ సబా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ  దేశ జనాభాలో 70 శాతంగా ఉన్న వలస కూలీల సంఖ్యను 30 శాతానికి తగ్గించేందుకు సిద్ధమయ్యారు. దీంతో వలస వెళ్లిన వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది. 

కరోనా వైరస్ కారణంగా చమురు ధరలు భారీగా పడిపోయాయి. దీంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై భారం పడింది. ఉపాధి లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కువైట్ పౌరులకు ఉద్యోగాలు కల్పించాలంటే వలస వచ్చిన వారిని తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోక తప్పలేదు. కువైట్ మొత్తం జనాభా 48 లక్షలు ఉంటే అందులో విదేశీయులే 34 లక్షల మంది ఉన్నారు. అందులో భారతీయులే 6.5 లక్షల మంది ఉండగా.. శ్రీలంక, బంగ్లాదేశ్ చెందిన వారు కూడా అధికంగా ఉన్నారు. దీంతో లక్షలాది మంది భారతీయులు ఇప్పుడు మళ్లీ ఖాళీ చేతులతో తిరిగి రావాల్సిన పరిస్థితి నెలకొనడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.