కేంద్రీయ విద్యాలయాల్లో (KVS) ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నేటితో దరఖాస్తుల ప్రక్రియ ముగియనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు నేడే ఆఖరు తేది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే ఒకసారి దరఖాస్తు ప్రక్రియను పొడిగించిన సంగతి తెలిసిందే. మరోసారి పొడిగింపు ఉండకపోవచ్చు. కాబట్టి ఉద్యోగార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు కేవీఎస్ అధికారిక వెబ్సైట్ Kvsangathan.nic.in ని సందర్శించాలి.
దేశవ్యాప్తంగా ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ఖాళీల భర్తీకి న్యూఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంగతన్ (కేవీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిద్వారా 13,404 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో 6990 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు ఉండగా, 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి డిసెంబరు 5 నుంచి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకాగా.. జనవరి 2తో దరఖాస్తు గడువు ముగియనుంది. వాస్తవానికి డిసెంబరు 26నే దరఖాస్తు గడువు ముగియాల్సి ఉంది. అయితే అభ్యర్థుల సౌలభ్యం కోసం వారంపాటు (జనవరి 2 వరకు) పొడిగించారు.
మొత్తం 13,404 పోస్టుల్లో టీజీటీ, పీజీటీ, పీఆర్టీ, లైబ్రేరియన్, ఫైనాన్స్ ఆఫీసర్, అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (యూడీసీ), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (ఎల్డీసీ), హిందీ ట్రాన్స్లేటర్, స్టెనోగ్రాఫర్ గ్రేట్-2 వంటి పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులను కంప్యూటర్ ఆధారిత రాతపరీక్ష ద్వారా ఎంపిక చేయనున్నారు.