ఎంత కష్టం.. 38 గంటల్లో 80 కిలోమీటర్లు  - MicTv.in - Telugu News
mictv telugu

ఎంత కష్టం.. 38 గంటల్లో 80 కిలోమీటర్లు 

March 25, 2020

Laborers walks to reach native places  

లాక్‌డౌన్‌తో దేశం స్తంభించిపోయింది. ఉద్యోగులు, కాస్త ఉన్నోళ్లు ఇళ్లలో ఎలాంటి కష్టం లేకుండా కాలం గడిపేస్తున్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని కూలినాలి ప్రజల పరిస్థితి దారుణంగా ఉంది. ఇక వలస కూలీల కష్టాలు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా.. మేము సైతం అంటూ వారు కూడా కరోనా కట్టడికి సహకరిస్తున్నారు. నగరాల్లో ఉండే పరిస్థితి లేదని, తమ ఊళ్లకు వెళ్లడానికి అనుమతిస్తే చాలని కోరుతున్నాయి. కానీ అధికారులు అందుకు ససేమిరా అంటున్నారు. 

ఉత్తరప్రదేశ్‌కు చెందిన అద్వేశ్ కుమార్ అనే 20 ఏళ్ల కూలి కష్టం వాస్తవానికి అద్దం పడుతుంది. ‘నేను ఉన్నావ్‌లో ఉండలేను సారూ.. ఇంటికి వెళ్లిపోవాలని మా కంపెనీ ఆదేశించింది. వేరే పని చేసుకోడానికి వీల్లేదు. ఇక్కడే ఉంటే తిండెవరు పెడతారు. అందుకే ఇంటికెళ్తున్నాం. కానీ బస్సులు లేవు. అందుకే కాళ్లనే నమ్ముకున్నాం.. ’ అని అతడు చెప్పాడు. ఉక్కు కర్మాగారంలో అతనితో కలసి పనిచేసే మరో 20 మంది కూలీలు కూడా అతని వెంట నడిచారు. పనికోసం లక్నో వచ్చిన వీరు ప్రధాని 21 రోజలు లాక్ డౌన్ ప్రకటించడంతో వీరు నిన్న సాయంత్రం లాంగ్ మార్చ్ ప్రారంభించారు. లక్నో నుంచి బారాబంకి జిల్లాలోని తమ గ్రామానికి వెళ్లాలంటే 80 కి.మీ ప్రయాణించాలి. కాలినడకన విశ్రాంతి తీసుకోకుండా నడిస్తే 36 గంటలు పడుంది. దారిలో ఆకలైతే తినడానికి కాసిని బిస్కట్లు, వాటర్ బాటిల్ తో ఆ కూలీల ప్రస్థానం సాగుతోంది.