పేరుకు పేద అయినా జ్ఞానానికి కాదని నిరూపించింది ఓ బాలిక. ఫుట్‌పాత్‌పై చదువుకుంటూనే పదో తరగతిలో ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించి మట్టిలో మాణిక్యంలా మారింది. కష్టపడి చదివి ఏకంగా 68 శాతం మార్కులు తెచ్చుకుంది. ఈ విషయం తెలిసిన మున్సిపల్ అధికారులు ఆమెకు బహుమతిగా ఇంటిని ఇచ్చారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఇది జరిగింది. ఆ బాలిక ప్రతిభ కారణంగా వారికి నిలువ నీడ దొరికినందుకు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఆ బాలిక కుటుంబం ఫుట్‌పాత్ నుంచి సొంత ఇంటిలోకి అడుగుపెట్టనుంది.
దశరథ్ అనే వ్యక్తి భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఓ ఫుట్‌పాత్‌పైనే జీవనం సాగిస్తున్నాడు. ప్రతి రోజూ కూలీ పనికి వెళ్తేనే వారికి కుటుంబ పోషణ. అలాంటి పరిస్థితుల్లో అతని కూతురు భర్తీ ఖండేకర్ తమ జీవితాల మార్పునకు చదువే మార్గమని నమ్మింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతూ.. ఇటీవల వచ్చిన పది ఫలితాల్లో 68 శాతం మార్కులు సాధించింది. ఇమె పరిస్థితి మున్సిపల్ అధికారులు తెలుసుకొని వారికో ఇంటిని బహుమతిగా ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆ బాలిక ఇంకా పై చదువులు చదువుకోవాలని మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. కాగా తాను ఐఏఎస్ కావాలనేది తన కోరిక అంటూ ఆమె పట్టుదలతో చెప్పడం మరో విశేషం.