ఇండియా లాడెన్..పట్టుబడిన ఆరు రోజులకే విషాదం - MicTv.in - Telugu News
mictv telugu

ఇండియా లాడెన్..పట్టుబడిన ఆరు రోజులకే విషాదం

November 17, 2019

కరడుగట్టిన అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను మట్టుబెట్టడానికి అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసిందో అందరికీ తెలిసిందే. లాడెన్ మాదిరే మనుషులను ఉత్తిపుణ్యానికి చంపుతూ ‘ఇండియా బిన్ లాడెన్’గా పేరు పొందిన ఏనుగు ఒకటి అస్సాం వాసులను హడలెత్తించింది. దాన్ని పట్టుకోడానికి చాన్నాళ్లుగా సాగుతున్న ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. ఇండియా మోస్ట్ వాటెండ్ ‘లాడెన్’ దురాగతాలకు తెరపడింది. గోల్పారా జిల్లాలో ఈ మదపుటేనుగు ఐదుగురిని చంపేసింది. 

పంటపొలాలను, ఇళ్లను ధ్వంసం చేస్తూ ధ్వంసం చేస్తోంది. దాని ఆటకట్టించడానికి అటవీ శాఖ అధికారులు, పోలీసులు భారీ ఆపరేషన్ చేపట్టారు. ఈ గజరాజు ఆచూకీ కోసం డ్రోన్లు వాడారు. పక్కా సమాచారం తెలుసుకుని బాణాల ద్వారా మత్తు మందు ప్రయోగించి పట్టుకున్నారు. దీన్ని జనావాసాలకు దూరంగా తరలిస్తామని చెప్పారు. తాజా సమాచారం ప్రకారం లాడెన్‌ ఏనుగు పట్టుబడిన ఆరు రోజుల తర్వాత ప్రాణాలు విడిచింది. అటవీ అధికారుల సంరక్షణలో బందీగా ఉన్న ఆ ఏనుగు ఆదివారం ఉదయం 5.30 గంటలకు చనిపోయిందని ఇక్కడి ఓరంగ్‌ నేషనల్‌ పార్కు అధికారులు తెలిపారు. తమ సంరక్షణలో బందీగా ఉన్న ఈ ఆరు రోజులుగా ఏనుగు చక్కగా ఉందని, ఈ క్రమంలో అనూహ్యంగా ప్రాణాలు విడిచిందని వివరించారు.