లేడీడాన్ ముక్కోణపు ప్రేమకథ.. మాజీ ప్రియుడి దాడి - MicTv.in - Telugu News
mictv telugu

లేడీడాన్ ముక్కోణపు ప్రేమకథ.. మాజీ ప్రియుడి దాడి

July 5, 2020

Love Story

పేరుకు క్రిమినల్స్ అయితే మాత్రం వారికి గుండె ఉండదా.. ఆ గుండెలో కూసింత ప్రేమ ఉండదా? కచ్చితంగా ఉంటుంది.. ఎందుకంటే వారు కూడా మనుషులే కాబట్టి. ఈ ముక్కోణపు ప్రేమకథ అలాంటిదే. గుజరాత్‌లో ముగ్గురు క్రిమినల్స్ మధ్య ప్రేమ ముదిరి పోలీస్ స్టేషన్‌లో పాకాన పడింది. భూరి అలియాస్ అస్మితాబా గోహిల్(22) అనే లేడీ డాన్, సూరత్‌లోని వరాచా ప్రాంతంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటుంది. దీంతో ఆమెకు క్రిమినల్ రికార్డు చాంతాడంత ఉంది. దారుణంగా హత్యలు చేసే ఆమె హృదయంలో ప్రేమ చిగురించింది. కొన్నాళ్ల కిందటి వరకు సంజయ్ బాఘేలా అనే గ్యాంగ్‌స్టర్‌తో ఆమె ఎంతో సన్నిహితంగా మెలిగింది. అయితే ఆ ప్రేమతో ఆమె సంతృప్తి చెందలేదు. కొన్నిరోజులుగా తన గ్యాంగ్‌లోని రాహుల్ అనే గ్యాంగ్‌స్టర్‌తో స్నేహంగా మెలగడం ప్రారంభించింది. 

ఇది తెలిసి ఆమె మొదటి ప్రియుడు సంజయ్ బాఘేలా భరించలేకపోయాడు. ప్రియురాలు అని కూడా చూడకుండా అస్మితాబాను చితకబాదాడు. రాహుల్ నివాసంలో ఉందన్న సమాచారంతో అక్కడికి వెళ్లిన బాఘేలా ఆమెను విచక్షణ రహితంగా కొట్టాడు. అంతేకాదు, ఎవరితో డేటింగ్ చేసినా ఇలాగే కొడతానని బెదిరించాడు. దీంతో ఆమె భయపడిపోయి తన కొత్త ప్రియుడి ఇంట్లోనే ఉండిపోయింది. బాఘేలా అంతటితో ఊరుకోకుండా మరుసటి రోజు కూడా వచ్చిన మరింత బీభత్సం సృష్టించాడు. అక్కడున్న రాహుల్ బైక్‌ను ధ్వంసం చేశాడు. దీంతో ఇంట్లోంచి బయటికి వచ్చిన అస్మితాబాను మరోసారి చితకబాదాడు. అతడి దౌర్జన్యాన్ని భరించలేకపోయిన అస్మితాబా పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించింది. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకునేలోపు పారిపోయేందుకు ప్రయత్నించిన బాఘేలా కాలు విరిగిపోయింది. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.