బౌన్సర్లను సినిమా హీరోహీరోయిన్లే కాదు…ఓ లేడీ ఆర్టీఏ ఆఫీసర్ వాడేసింది. నడిరోడ్డుపై వాహనదారుల నుంచి కలెక్షన్లు వసూలు చేయించింది. చివరకు అక్రమ వసూళ్ల ఆరోపణలతో సస్పెన్షన్ వేటు పడింది.
ఈ ఆర్టీఏ ఇన్స్పెక్టర్ పేరు స్వాతి గౌడ్.ఈమె రూటే సెపరేట్. అందరు ఆర్టీఏలు ఒకదారిలో నడిస్తే…స్వాతిగౌడ్ సంథింగ్ స్పెషల్ అంటూ మరోదారిలోకి మళ్లింది. సినిమావాళ్లే బౌన్సర్లు వాడుతారా..నేనేందుకు వాడొద్దు అనుకుందేమో…కలెక్షన్ల దందాలోకి వారిని దింపేసింది. బౌన్సర్లను పెట్టి మరీ డబ్బు వసూలు చేసింది.
సికింద్రాబాద్లో అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నది స్వాతిగౌడ్.ఇటీవల ఎల్బీనగర్ దగ్గర వాహనాలను తనిఖీ చేస్తూ ప్రైవేటు వ్యక్తులను అక్రమ వసూళ్లకు వాడుకుంటున్నట్లు ఆరోపణలు వచ్చాయి. శ్రీకాంత్ రెడ్డికి చెందిన లారీని ఆపిన ఆమె అతనిపై కేసును రాస్తాను అని బెదిరించింది. దీంతో సదరు లారీ ఓనర్ కేసు డబ్బులు కట్టేందుకు సిద్ధమయ్యాడు. కానీ ఆర్టీఏ అధికారి స్వాతిగౌడ్ మాత్రం లంచం ఇస్తే, వెంటనే వాహనాన్ని వదిలేస్తానంటూ చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఈ ఘటన తర్వాత స్వాతికి చెందిన బౌన్సర్లు ఆ లారీ సిబ్బందిపై దాడి చేసినట్లు అక్కడ ఉన్న సీసీటీవీలకు చిక్కింది. వసూళ్ల ఘటనకు సంబంధించి లారీ ఓనర్ శ్రీకాంత్, ఇన్స్పెక్టర్ స్వాతి ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లయింట్ చేసుకున్నారు. స్వాతి మనుషులు లారీ ఓనర్పై దాడి చేసిన ఫుటేజ్ ను పరిశీలించిన అధికారులు యాక్షన్ తీసుకున్నారు. బాధ్యతారహితంగా విధులను నిర్వహిస్తున్న స్వాతిగౌడ్ను తొలిగిస్తున్నట్లు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ టీ.రఘనాథ్ తెలిపారు. లంచం ఇవ్వాలంటూ వత్తిడి తెచ్చినందుకు కూడా ఆమెపై వేటు వేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఉన్నత అధికారుల ఆదేశాలు లేకుండానే స్వాతి వాహనాలను చెక్ చేస్తోందన్నారు. రవాణశాఖకు చెందిన ప్రిన్సిపల్ కార్యదర్శి ఇచ్చిన ఆదేశాల మేరకు ట్రాన్స్పోర్ట్ అధికారులు స్వాతిపై సస్పెన్షన్ విధించారు. ఆర్టీఏ ఇన్స్పెక్టర్ వాడిన బౌన్సర్లలో ఆమె సోదరుడు సాయిగౌడ్ కూడా ఉన్నాడు.
అసలే ఉద్యోగాలు దొరక్క నిరుద్యోగులు తిప్పలు పడుతుంటే ..దర్జా గవర్నమెంట్ జాబ్ వచ్చాక ఇలా చేయడం ఏంటనీ జనం విస్తుపోతున్నారు.