దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్ ఖేరీ కేసులో నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ కుమార్ మిశ్రా, కుమారుడు ఆశిశ్ మిశ్రాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 8 వారాల పాటు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసింది.
అంతకుముందు ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా నిందితుడు ఆశిశ్ మిశ్రా వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితులను ఎల్లకాలం నిర్బంధించి ఉంచలేమని.. సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ కేసులో అత్యంత దారుణంగా కారాగారంలో మగ్గుతున్న బాధితులు రైతులేనని.. ఆశిశ్ మిశ్రకు బెయిల్ మంజూరు చేయకపోతే, వారు కూడా జైల్లోనే ఉండే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. బెయిల్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేస్తూ.. ఇది ఇరువర్గాల హక్కులను సమతుల్యం చేసే కేసు అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేకే మహేశ్వరిలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. వాదనల సమయంలో ఆశిశ్ మిశ్రా బెయిల్ పిటిషన్‌ను యూపీ సర్కార్ వ్యతిరేకించింది. ఎనిమిది మంది రైతుల ప్రాణాలు పోవడానికి కారకుడైన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తే అది సమాజంలోకి తప్పుడు సంకేతాలను పంపిస్తుందని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
2021 అక్టోబర్ 3న యూపీలోని లఖింపుర్ ఖేరీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపట్టారు. ఆ సమయంలో నిరసన చేస్తున్న రైతులపై కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు తన వాహనాన్ని ఎక్కించారు .ఆ మసయంలో ఆశిశ్ మిశ్రా వాహనంలోనే ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగి మరో నలుగురు మృతి చెందారు. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆశిశ్ మిశ్రాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలంటూ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.