2009లో జరిగిన హత్యాయత్నం కేసులో కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్ కి చెందిన ఏకైక ఎంపీ మహ్మద్ ఫైజల్ కి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఈ కేసులో మొత్తం 23 మంది నిందితులు ఉండగా, నలుగురుని దోషులుగా గుర్తించిన కవరత్తి కోర్టు.. ఎంపీతో పాటు ముగ్గురి బెయిల్ ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2009లో మహ్మద్ ఫైజల్ తన బంధువు అయిన మహ్మద్ సలీపై దాడికి పాల్పడ్డాడు. షెడ్ నిర్మాణంపై జరిగిన గొడవలో మహ్మద్ ఫైజల్ సారథ్యంలోని ముఠా దాడి చేయగా, ఈ నేరం కోర్టు ముందు రుజువైంది. దీంతో ఇన్నాళ్లూ విచారించిన కోర్టు శిక్ష ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది. ఇక దాడిలో గాయపడ్డ సలీ చికిత్స కోసం కేరళలో నెలల తరబడి చికిత్స తీసుకొని కోలుకున్నాడు. అటు శిక్ష పడ్డ ఫైజల్ కి ఎంపీగా అనర్హత వేటు పడకుండా ఉండడానికి కేరళ హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. కాగా, 2014 నుంచి ఫైజల్ లక్ష ద్వీప్ నుంచి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా గెలుచుకుంటూ వచ్చారు. .