హత్యాయత్నం కేసులో పదేళ్లు జైలుశిక్ష పడిన లక్షద్వీప్ ఎన్సీపీ ఎంపీ మహ్మద్ ఫైజల్ ఆ పదవికి అర్హరుడు కాడని లోక్‌సభ ప్రకటించింది. ఆయనను పదవికి అనర్హుడని ప్రకటిస్తూ శుక్రవారం పొద్దుపోయాక నోటిఫికేషన్ విడుదల చేసింది. హత్యాయత్నం కేసులో ఫైజల్‌ను కవరట్టీ సెషన్స్ కోర్టు దోషిగా తేల్చి పదేళ్ల జైలు శిక్ష విధించింది. తీవ్ర నేరాల్లో దోషులుగా తేలినవారు ఎంపీ పదవికి అర్హులు కాదని చట్టం చెబుతుండడంతో ఈ నేపథ్యంలో అనర్హత వేటుపడింది.. రాజ్యాంగంలోని 102 (1)(ఈ) అధికరణ ప్రకారం ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని, జనవరి 11 నుంచే ఈ నిర్ణయం వర్తిస్తుందని తెలిపింది. కేంద్ర మాజీ మంత్రి సీఎం సయీద్ అల్లుడైన పదాంత సాలిహ్‌ను హత్య చేయడానికి 2009లో కుట్ర జరిగింది. ఆయనపై కత్తులు, రాడ్లతో దాడి చేశారు. వెంటనే ఆస్పత్రికి తరలించడంతో ప్రాణగండం తప్పింది. ఈ కేసులోనే ఫైజల్ దోషిగా తేలాడు.