శివరాత్రి రోజున శివైక్యం చెందిన నందమూరి తారకరత్న మరణంపై వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమి చైర్ పర్సన్ లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తారకరత్న 23 రోజుల క్రితమే బ్రెయిన్ డెడ్‌కి గురై చనిపోయాడని అప్పటి నుంచి ఈ వార్త బయటికి రాకుండా చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించారని ఆరోపించారు. తన కొడుకు నారా లోకేశ్ తలపెట్టిన యువగళం పాదయాత్రకు చెడ్డపేరు రాకుండా ఉండేందుకు చంద్రబాబు ఇంత నీచానికి దిగజారాడన్నారు. అతని దుర్మార్గానికి ఇది పరాకాష్టగా అభివర్ణించారు. తన రాజకీయ స్వార్థం కోసం నందమూరి కుటుంబంలో మరొకరిని వాడుకున్నారని అభిప్రాయపడ్డారు. తారకరత్న మరణించాడని తొలిరోజుల్లోనే డాక్టర్లు ధృవీకరించారని, గుండె ఆగిపోయిన విషయాన్ని చెప్పేశారని తెలిపారు.
కానీ అప్పుడే ప్రకటిస్తే రాష్ట్రానికి చంద్రబాబు – లోకేశ్‌లు అపశకునమనే భావన ప్రజల్లో వస్తుందనే కారణంతో వార్తను బయటికి రానివ్వలేదన్నారు. చంద్రబాబు నీచ రాజకీయానికి తన భర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు కూడా ఇలాగే కుమిలి కుమిలి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. పాపం తారకరత్న. రాజకీయంగా నారా కుటుంబానికి సాయం చేయాలనే మంచి ఉద్దేశంతో ఎంతో అభిమానంతో ముందుకు వచ్చాడని, అలాంటి వ్యక్తిపై చంద్రబాబు కనికరం లేకుండా వ్యవహరించాడని మండిపడ్డారు.