Lakshmi Shailaja fighting in front of her husband's house in konaseema
mictv telugu

పవన్, సమంతనే అలా చేశారు.. నువ్వు చేయలేవా అంటూ వేధింపులు

October 18, 2022

సినీ హీరోలు, హీరోరయిన్లు చేసే పనులు సమాజంపై ఎంత ప్రభావం చూపిస్తాయో మనం అనేక సంఘటనలు చూశాం. కానీ, వారి వ్యక్తిగత జీవితాలు కూడా సమాజంపై ప్రభావం చూపుతాయని ఈ ఘటన ద్వారా తేటతెల్లమైంది. కట్నం సరిపోక, అదనపు కట్నం కోసం కోడలిని వేధించిన అత్త.. లేకుంటే తన కుమారుడికి విడాకులు ఇవ్వాలని బలవంతం చేస్తున్నారు. సినిమా పరిశ్రమలో ఉన్న పవన్ కల్యాణ్, సమంతలే అలా చేయగా లేంది? నువ్వు నీ భర్తకు విడాకులు ఇవ్వలేవా? అని మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. కోనసీమ జిల్లా మండపేట మండలం ద్వారపూడిలో జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన నామాల రంగారావు కుమారుడు మోహన్ శ్యామ్ చరణ్‌కు లక్ష్మీ శైలజతో డిసెంబర్ 2020లో వివాహమైంది. ఆ సమయంలో అర ఎకరం పొలం, పది లక్షల నగదు, ఆడపడుచు లాంఛనాలు ముట్టజెప్పారు.

పెళ్లి సమయంలో 60 వేల జీతంలో సాఫ్ట్‌వేర్ ఇంజీనీర్‌గా పని చేసిన భర్తకు.. ఇటీవల ప్రమోషన్ వచ్చి జీతం లక్షన్నరకు పెరిగింది. హోదా పెరగడంతో ఇంకా 10 లక్షల కట్నం తేవాలని అప్పట్నుంచి భర్త, అత్తమామలు వేధిస్తున్నారు. అలా అయితేనే అబ్బాయితో కాపురం చేయిస్తామని ఇంటి నుంచి గెంటేశారు. దీంతో గత్యంతరం లేక అత్తింటి వారి వద్ద లక్ష్మీ శైలజ మౌనపోరాటం చేస్తోంది. పవన్ కల్యాణ్, సమంతల పేర్లు చెప్పి విడాకులు కావాలని మానసిక క్షోభకు గురి చేస్తున్నారని, పెద్దోళ్లే అలా చేసినప్పుడు నువ్వు చేస్తే తప్పేంటని అత్త తనను వేధిస్తోందని వాపోయింది. రెండేళ్ల కాపురం చేసిన తర్వాత ఇలా వదిలేస్తే తన జీవితం ఏం కావాలని నిలదీస్తోంది. పైగా మానసిక స్థితి సరిగ్గా లేదని తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించింది. భర్త తనను కాపురానికి తీసుకెళ్లే వరకు పోరాటం ఆపేది లేదని కరాఖండీగా చెప్తోంది. కాగా, ఆమె భర్త హైద్రాబాదులో ఉద్యోగ విధులు నిర్వర్తిస్తున్నాడని సమాచారం.