హైదరాబాదులో మొదటిసారి నమోదైన ఇంజనీరింగ్ విద్యార్థి డ్రగ్ మరణం సంఘటన పట్ల పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఈ కేసులో కీలక నిందితుడైన లక్ష్మీపతిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారం రోజుల గాలింపు అనంతరం ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విచారణలో లక్ష్మీపతికి నగరంలో భారీ స్థాయిలో నెట్వర్క్ ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సంపన్నలైన సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విలాసాలకు అలవాటు పడ్డ ఇంజనీరింగ్ విద్యార్ధులే టార్గెట్‌గా డ్రగ్స్ విక్రయించేవాడని దర్యాప్తులో వెల్లడైంది. గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి, సోషల్ మీడియా యాప్‌ల ద్వారా 100 మంది కస్టమర్లకు చేరవేసేవాడని తేలింది. గంజాయిని మరిగించి తీసే ఒక రకమైన హాష్ ఆయిల్‌ను రూ. 6 నుంచి రూ. 8 లక్షల వరకు ఒక లీటర్ అమ్మేవాడని పోలీసుల విచారణలో తెలిసింది. ఈ క్రమంలో లక్ష్మీపతిపై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవగా, లక్ష్మీపతికి హాష్ ఆయిల్ సరఫరా చేసే ముఠాను కనుగొనే పనిలో పడ్డారు పోలీసులు.