కోడి కూర తినాలంటే ముందుగా కోడిని కోయాలి, బొచ్చు తీసేయాలి, ముక్కలుగా కట్ చేయాలి. ఆ తర్వాత వండాలి. ఇదంతా హింస అని కొందరంటారు. కానీ చికెన్ టేస్ట్ మరిగిన వాళ్లు మాత్రం కొట్టిపడేస్తుంటారు. కోళ్లను తినకపోతే వాటి సంఖ్య పెరిగిపోతుందని జోకులేస్తుంటారు. ఇకపై ఇలాంటి వాదవివాదాలు, హింస ఉండకపోవచ్చు. కోడిని కోయకుండానే మాంచి రుచికరమైన కోడికూరను తినేయొచ్చు. పెరిగిన టెక్నాలజీ సాయంతో శాస్త్రవేత్తలు దీన్ని సాధ్యం చేశారు.
అమెరికా శాస్త్రవేత్తలు కణ ఆధారిత మాంస ఉత్పత్తితో కృత్రిమ కోడిమాంసాన్ని తయారు చేశారు. వారు తొలుత సజీవంగా ఉన్న కోడి నుంచి కొన్ని కణాలను వేరు చేశారు. తర్వాత లేబొరేటరీలో వాటిని అభివృద్ధి చేశారు. కణ విభజన జరిగి కృత్రిమ పద్ధతుల్లో మాంసం తయారయింది. దీన్ని వండి రుచి చూడగా అచ్చం చికెన్ లాగే ఉంది. ఇదివరకు కూడా ఇలాంటి ప్రయోగాలు జరిగినా అనుకున్న ఫలితాలు రాలేదు. తాజా పరిశోధనతో రుచి, పరిమాణం వంటి విషయాల్లో ఆశించిన ఫలితాలు రాబట్టారు. కోళ్లనే కాకుండా మేకలు, గొర్రెలు, బీఫ్, చేపలు సహా పలు జంతువుల కణాల ద్వారా కృత్రిమంగా మాంసాన్ని ఉత్పత్తి చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఈ విధానం వల్ల జంతువులను చంపాల్సిన అవసరం ఉండదని, మాంసం వల్ల వ్యాధులు రావని చెప్పారు.