లలితా జ్యువెలర్స్‌లో ఎలా కొట్టేశారో చూడండి..! - MicTv.in - Telugu News
mictv telugu

లలితా జ్యువెలర్స్‌లో ఎలా కొట్టేశారో చూడండి..!

December 19, 2017

సోమాజిగూడలోని లలితా జ్యువెలర్స్‌ సంస్థలో గత సోమవారం 66 గ్రాముల బంగారు నగలు ఎత్తుకెళ్లిన ప్రేమజంట దొరికింది. వీరిని పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి కొట్టేసిన నగలను తీసుకెళ్లి తమ స్వస్థలమైన కృష్ణాజిల్లా నందిగామలోని  ఫైనాన్స్‌ సంస్థలో తాకట్టుపెట్టారు.

ఆ బంగారం రికవరీ చేయడానికి పోలీసులు అక్కడికెళ్లారు. నందిగామకు చెందిన కరీముల్లా, వాణి బతుకుతెరువు కోసం ఈ ఏడాది అక్టోబర్‌లో హైదరాబాద్ వలసవచ్చారు. సికింద్రాబాద్‌ సింధీ కాలనీలోని బాయ్స్, గర్ల్స్‌ హాస్టల్స్‌లో నివసిస్తూ ఉద్యోగయత్నాలు చేస్తున్నారు. ఇబ్బందులో ఉన్న వీరు లలిత జ్యువెలర్స్‌పై కన్నేశారు. గత సోమవారం మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో జ్యువెలర్స్‌కు వచ్చారు. నగల వివరాలు అడుగుతూ మొదటి అంతస్తులోకి చేరుకున్నారు. అక్కడున్న రద్దీని తమకు అనువుగా చూసుకుని రెండు జతల బంగారు గాజులు (55.3 గ్రాములు), ఓ బ్రాస్‌లెట్‌ (10.7 గ్రాములు) ఎత్తుకుపోయారు. ఆ రోజు దుకాణం మూసే సమయంలో స్టాక్‌ సరిచూడగా తేడా కనిపించింది.
సీసీ కెమెరాలను పరిశీలించగా ఈ చోరీ బయటపడింది. దీని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్‌లతో పాటు సాంకేతిక ఆధారాలతో నిందితుల్ని గుర్తించారు పోలీసులు.. చోరీ సొత్తును కరీముల్లా నందిగామలోని ముత్తూట్‌ ఫైనాన్స్‌ సంస్థలో రూ. 1.2 లక్షలకు తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది.

ముందుకు సాగని మొదటి కేసు…

లలిత జ్యువెలర్స్‌లో ఈ నెల 3న తొలి దొంగతనం జరిగిన సంగతి తెలిసిందే. బురఖా ధరించిన వచ్చిన ఇద్దరు మహిళలు రూ.6 లక్షల విలువైన 20 తులాల బంగారు నెక్లెస్‌ను ఎత్తుకెళ్ళారు. అదివరకే షాపుకు వచ్చిన  బంగారు నెక్లెస్‌ ఫొటో తీసుకెళ్లిన ఆ మహిళలు దాని స్థానంలో రోల్డ్‌గోల్డ్‌ నెక్లెస్ ఉంచి ఉడాయించారు. నిందితురాళ్ళు దుకాణానికి వచ్చిన ఆటోను సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించారు.  వారు ఆ రోజు కోఠిలోని ఆంధ్రాబ్యాంకు కూడలివద్ద తన ఆటో ఎక్కినట్లు డ్రైవర్ చెప్పాడు. దీంతో అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజ్‌లు సేకరించిన పరిశీలించారు. కానీ గట్టి ఆధారాలేవీ దొరకలేదు.