రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని భూములు రాయించుకొని.. లాలూపై కొత్త కేసు - MicTv.in - Telugu News
mictv telugu

రైల్వేలో ఉద్యోగాలిప్పిస్తామని భూములు రాయించుకొని.. లాలూపై కొత్త కేసు

May 20, 2022

బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై మరో కొత్త కేసు నమోదైంది. లాలూ కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు అభ్యర్థుల నుంచి లంచం కింద భూములు రాయించుకున్నారని అభియోగం. వీటిపైనే కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు.ఈ కేసులో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన సీబీఐ నేడు దర్యాప్తు చేపట్టింది. లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తెలు మీసా భారతి, హేమలతో పాటు పలువురు అభ్యర్థులపైనా కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా నేడు 17 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు జరిపింది సీబీఐ. దిల్లీ, పట్నా, గోపాల్‌గంజ్‌లోని లాలూ నివాసాలతో పాటు పలు కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో లాలూ కుమార్తె.. మీసా భారతి RJD నుంచి రాజ్యసభకు పోటీ చేస్తారని స్థానిక మీడియా వర్గాలు పేర్కొంటున్న తరుణంలో.. ఆమెకు సంబంధించిన ఆస్తులపై దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.