ఉత్తరాఖండ్ లోని జోషిమఠ్ తరహాలో మరో రెండు గ్రామాలు కుంగిపోతున్నాయి. పలు చోట్ల భూమి కుంగిపోతూ ఇళ్లు, భవంతులకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. జోషిమఠ్ తో మొదలైన ఈ ఉత్పాతం కర్ణప్రయాగ్ చేరుకోగా, తాజాగా తెహ్రి జిల్లా చంబా పట్టణానికి పాకింది. పట్టణ చెరువు సమీపంలోని గ్రామాల్లో కొండచరియలు విరిగి పడుతుండడం, స్థానికంగా ఉన్న టన్నెల్ కి ఎగువన, దిగువన పగుళ్లు ఏర్పడడంతో అక్కడి కుటుంబాలు ప్రమాదంలో పడ్డాయి. ఆల్ వెదర్ ప్రాజెక్టు కింద 440 మీటర్ల పొడవుండే టన్నెల్ నిర్మాణంతో చంబా మార్కెట్ కూడా కుంగిపోతోంది. దీనిపై ఓ స్థానికుడు మాట్లాడుతూ ఇళ్ల పగుళ్లపై పలు మార్లు సర్వేలు నిర్వహించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయాడు. జోషిమఠ్ తరహాలోనే తమకు పునరావాస ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. అటు జోషిమఠ్ లో 723 ఇళ్లు దెబ్బతినగా, 131 కుటుంబాలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.