ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పట్టణం జోషిమఠ్ ప్రమాదంలో ఉంది. వాతావరణంలో వస్తున్న పెనుమార్పుల కారణంగా ఆ పట్టణంలోని ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి. కొండచరియలు విరిగిపడటం, భూమి కుంగిపోవడంతో వందలాది ఇళ్లకు పగుళ్లు, ఆ పగుళ్ల నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. ఆ నీటితో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రోజు రోజుకూ పరిస్థితి దిగజారుతుండడంతో.. అక్కడి ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇళ్లకు పెద్ద ఎత్తున పగుళ్లు ఏర్పడుతుండడంతో భయంతో వణికిపోతున్నారు. ఏం జరుగుతుంతో తెలియని అక్కడి నివాసితులు తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు.
ఏ క్షణమైనా పట్టణం మొత్తం భూమిలో కలిసిపోతుందని.. నీటిలో మునిగిపోతుందని టెన్షన్ పడుతూ మొత్తం ఖాళీ చేస్తున్నారు. అటు అధికారులు సైతం అప్రమత్తమయ్యారు. నగరంలో పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతుండగా, ఇప్పటికే 561 ఇళ్లకు పగుళ్లు వచ్చాయని, 3వేల మంది ప్రజలు ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చిందని మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శైలేంద్ర పవార్ తెలిపారు. స్థానిక అధికారులు బీటలతో దెబ్బతింటున్న ఇళ్లను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారని, చాలా మంది తమ సొంత నివాసాలను వదిలిపెట్టి సురక్షిత ప్రాంతానికి వెళ్లినట్లు ఆయన తెలిపారు. ఇళ్లకు బీటలు వారుతున్న నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి సహాయసహకారాలు అందించాలని సీఎం పుష్కర్ సింగ్ ధామి అధికారులకు సూచించారు.