ఆన్‌లైన్ క్లాసులను అత్యంత శ్రద్ధగా వింటున్న కోతులు..  - MicTv.in - Telugu News
mictv telugu

ఆన్‌లైన్ క్లాసులను అత్యంత శ్రద్ధగా వింటున్న కోతులు.. 

October 13, 2020

చేస్తున్న పనిని ఎవరైనా చెడగొడితే.. ‘ఏంట్రా ఆ కోతి చేష్టలు? నా పనంతా పాడుచేశావ్’ అని తిడుతుంటారు. తాను చెడిందే కాకుండా వనమంతా చెరచడంలో కోతులది అందెవేసిన చేయి. ఓచెట్టు మీద అవి కుదురుగా కోర్చోలేవు. ఈ కొమ్మ మీద నుంచి ఆ కొమ్మ మీదకు, ఇళ్ల మీదకు కిచకిచలాడుతూ ఎగురుతుంటాయి. వాకిట్లో, వరండాలో ఏం ఉన్నా హాంఫట్ చేసేస్తాయి. ఇలా నానా అల్లరి చేసే కోతులు ఓ చోట మాత్రం కామ్‌గా కూర్చున్నాయి. కూర్చోవడమే కాదు ఆన్‌లైన్ క్లాసులను మహా శ్రద్ధగా విన్నాయి. వాటిని చూసినవారు ఇవి నిజంగా కోతులేనా? నిశ్శబ్దంగా ఉంటే అవి కోతులు ఎలా అవుతాయని పరీక్షగా చూస్తున్నారు. అయినా అవి కదలకుండా కిటికీ ఊచలు పట్టుకుని కూర్చుని పాఠాలు విన్నాయి. 

ఇందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కరోనా వైరస్ కారణంగా ఆన్‌లైన్ క్లాసులు అనివార్యమైన విషయం తెలిసిందే. ఈ ఫొటోలో విద్యార్థి యూనిఫాం వేసుకుని ఐడీ కార్డ్ వేసుకుని స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ క్లాసులు వింటున్నాడు. అదే సమయంలో ఆ చిన్నారి వెనుక ఉన్న కిటికీ వద్దకు మూడు కొండముచ్చులు వచ్చి కూర్చున్నాయి. వాటిని చూడగానే సదరు విద్యార్థి తన చదువు ఇక అయినట్టే అనుకున్నాడు. ఏదో కోతి చేష్ట చేసి తనను అస్సలు చదువుకోనివ్వవు అనుకున్నాడు. కానీ, ఆ కొండముచ్చులు మూడు బుద్ధిమంతురాళ్లే. బాలుడి చదువుకి ఎలాంటి ఆటంకం కలిగించకుండా అలా కూర్చుని శ్రద్ధగా క్లాసు విన్నాయి. దీంతో ఆ బాలుడు, అతని తల్లిదండ్రులు ఎంతో ఆశ్చర్యపోయారు. కోతుల్లో అల్లరినే చూసేవారికి వాటిలో ఉన్న శ్రద్ధను కూడా చూడాలని వారు ఆ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీంతో ఆ ఫొటో తెగ వైరల్‌గా మారింది. నెటిజన్లు కోతుల శ్రద్ధ చూసి తెగ సంబరపడిపోతున్నారు. కోతుల్లో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యం వెలిబుచ్చుతున్నారు.