ఆర్ధిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. మొన్నటివరకు ఆకలి కేకలతో అల్లాడిన లంకేయులు..తాజాగా హింస్మాకాండకు దిగారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా వారి ఇళ్లపై దాడులు దిగుతున్నారు. సోమవారం అధికార పార్టీకి చెందిన పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు. ఈ హింసాత్మక ఘటనల్లో అధికార పార్టీకి చెందిన ఎంపీతో మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆందోళనలకు బాధ్యత వహిస్తూ మహీంద రాజపక్స తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా నిన్న రాజీనామా చేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రావడం కాదు కదా.. ఇంకా ఆందోళనలు శృతి మించాయి.
PM Mahinda Rajapaksa’s ancestral home in Madamulluna has been set on fire. pic.twitter.com/JAN52w5Gxw
— DailyMirror (@Dailymirror_SL) May 9, 2022
ఈ దుస్థితికి కారణం తమ రాజకీయ నేతలే అంటూ హంబన్టోటలోని రాజపక్స పూర్వీకుల ఇంటికి నిరసన కారులు నిప్పు పెట్టారు. మెదములానాలో ప్రధాని మహింద రాజపక్సే, అతని తమ్ముడు అధ్యక్షుడు గోటబయ రాజపక్స ఇళ్లను దహనం చేశారు. కొందరు మహీంద తండ్రి జ్ఞాపకార్థం నిర్మించిన డీఏ రాజపక్స విగ్రహాన్ని కూడా ధ్వంసం చేశారు. అక్కడి రాజపక్స మ్యూజియంలోని రాజపక్స కుటుంబీకుల మైనపు విగ్రహాలను విరగొట్టారు. దీంతో పాటు మహీంద కేబినెట్లో ఉన్న పలువురు మంత్రుల నివాసాలను ఆందోళనకారులు తగలబెట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో రాజపక్స అధికారిక నివాసం వద్ద ఆర్మీ వేల సంఖ్యలో బలగాలను మోహరించింది .
రాజీనామా అనంతరం ఆందోళనలకు భయపడి కుటుంబంతో సహ ఓ నావికాదళ స్థావరంలో తలదాచుకున్నారు రాజపక్స. హెలికాప్టర్ ద్వారా ట్రింకోమలీలోని ఓ నేవీ బేస్కు వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఆందోళన కారులు నేవీ స్థావరం ఎదుట కూడా నిరసనలు చేపట్టారు.