చైనా అప్పులకు బలయిన మరో దక్షిణాసియా దేశం
అప్పులతో ప్రపంచ దేశాలపై దండయాత్ర చేస్తున్న డ్రాగన్ నోటికి మరో దేశం చిక్కింది. ఇప్పటికే ఈ లిస్టులో మన సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక దేశాలు విలవిలలాడుతుండగా, మరో దక్షిణాసియా దేశమైన లావోస్ బలయ్యేందుకు సిద్ధంగా ఉంది. విపరీతంగా పెరిగిపోయిన ధరలు, తరుగుతున్న విదేశీ మారక నిల్వలు, ద్రవ్యోల్బణంలతో ఆ దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇప్పటికే ఆ దేశ కరెన్సీ కిప్ విలువ డాలరుతో పోలిస్తే 36 శాతం క్షీణించింది. గత నెలలోనే ద్రవ్యోల్బణం 13 శాతం పెరుగగా, ఈ స్థాయిలో పెరగడం గత 18 ఏళ్లలో ఇదే మొదటిసారి.
75 లక్షల జనాభా కలిగిన ఈ దేశం చైనా, మయన్మార్, వియత్నాం, కాంబోడియా, థాయ్ లాండ్ దేశాలతో సరిహద్దులు పంచుకుంటోంది. లావోస్ వార్షికాదాయం 130 కోట్ల డాలర్లు కాగా, ప్రతీ ఏడాది ఆ దేశం చెల్లించాల్సిన అప్పు కూడా అంతే ఉంది. దాంతో తన ఆదాయాన్నంతా అప్పు చెల్లించడానికే సరిపోతుంది. దీంతో చమురు వంటివి దిగుమతి చేసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతోంది. ఆ దేశ మొత్తం అప్పులు 1450 కోట్ల డాలర్లు కాగా, అందులో 700 కోట్ల డాలర్లు కేవలం చైనావే కావడం గమనార్హం. హైడ్రో పవర్ ప్రాజెక్టులు, రైల్వే లైన్ల పేరిట పెద్ద మొత్తంలో అప్పు చేయగా, అందులో చైనా - లావోస్ కారిడార్‌కే 600 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. దీంతో ఈ ప్రాజెక్టు లావోస్‌కి గుదిబండలా మారి ఆ దేశాన్ని దివాలా అంచుకు తీసుకెళుతోంది. ఇప్పుడు ఆ దేశం సంక్షోభం నుంచి బయటపడాలంటే చైనా దయా దాక్షిణ్యాలు ఒక్కటే మార్గం. అయితే చైనా అప్పులన్న మాటే కానీ, ఆ దేశం నేరుగా రుణం ఇవ్వదు. తమ కంపెనీల ద్వారా అప్పు ఇచ్చి ఒప్పందం చేసుకుంటుంది. దాంతో ఇతర దేశాలు, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ వంటివి వ్యతిరేకించడానికి కుదరదు. ఈ అప్పులు ఆయా దేశాలు చెల్లించవని తెలిసే.. గడువు ముగిసిన తర్వాత పోర్టులు, ఎయిర్ పోర్టులను స్వాధీనం చేసుకుంటుంది. ఇలాగే శ్రీలంకలో హంబన్ టోటాను తన హస్తగతం చేసుకుంది.