ఆగ్రాతో శివాజీకి ఏం సంబంధం? మొగల్ ‘వారసుడి’ ధ్వజం - MicTv.in - Telugu News
mictv telugu

ఆగ్రాతో శివాజీకి ఏం సంబంధం? మొగల్ ‘వారసుడి’ ధ్వజం

September 24, 2020

 Last Mughal descendant vows to construct 'Mughal Museum' in Agra on own land.

ఆగ్రాలో నిర్మించ తలపెట్టిన ‘మొగల్ మ్యూజియం’ పేరును మార్చడంపై వివాదం చెలరేగుతోంది. ఆ మ్యూజియానికి మరాఠా చక్రవర్తి ఛత్రపతి శివాజీ పేరును పెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ప్రకటించారు. మొగల్ వంశ ‘చివరి వారసుడి’నని చెప్పుకునే హైదరాబాద్ వాసి యాకూబ్ హబీబుద్దీన్ ప్రిన్స్ టూసీ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘ఆగ్రాకు వెళ్లేవారు మొగల్ రాజుల గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. శివాజీకి ఆగ్రాతో ఏం సబంధం? మొగల్ మ్యూజియానికి ఆయన పేరు పెట్టడంతో అర్థం లేదు. మొగల్ చివరి చక్రవర్తి బహదూర్ షా దేశం కోసం త్యాగం చేశారు.. ’ అని ఆయన అన్నారు. ఆగ్రాలో తన సొంత స్థలంలో, సొంత ఖర్చుతో  మొగల్ మ్యూజియం నిర్మిస్తానని ప్రకటించారు. అయోధ్య, ఆదిత్యానాథ్ ప్రభుత్వ నిర్ణయాలపై టూసీ తరచూ స్పందిస్తుంటారు. అయోధ్య రామమందిరానికి తన వంతుగా బంగారు ఇటుకను అందజేస్తానని ఆయన ఇటీవల చెప్పారు. టూసీ మొగల్ వారసుడినని చెప్పుకుంటున్నా చాలా మంది నమ్మడం లేదు. తామే చివరి వారసులమని దేశంలో చాలా మంది చెప్పుకోవడమే దీనికి కారణం. తన డీఎన్ఏ తైమూర్ డీఎన్ఏను పోలి ఉందని టూసీ చెబుతుంటారు. అయితే తైమూర్ డీఎన్ఏతో పలువురు యూదుల డీఎన్ఏ కూడా పోలి ఉండడంతో ఎవరేం చెప్పినా నమ్మడానికి లేకుండా పోయిందని నిపుణులు అంటున్నారు. కాలక్రమంలో జాతుల మధ్య సాంకర్యాలు సహజమేనని, ఇప్పుడు గొప్పగా చెప్పుకోవాల్సిందేమీ మిగల్లేదని జన్యుశాస్త్రవేత్తల విశ్లేషణ.