నలుగురికి ఉరి మన దేశంలో ఇదే తొలిసారి కాదు.. - MicTv.in - Telugu News
mictv telugu

నలుగురికి ఉరి మన దేశంలో ఇదే తొలిసారి కాదు..

January 9, 2020

Maharashtra.

నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు  దోషులను ఈ నెల 22న ఉదయం 7 గంటలకు తిహార్ జైలులో ఉరి తీయాలని ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. వారిని ఉరి తీసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఒకే రోజు నలుగుర్ని ఉరితీయడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది నిజం కాదు. గతంలోనూ సామూహిక మరణదండన పడింది. 

1970-80 దశకంలో మహారాష్ట్రలో సీరియల్ హత్యలు తీవ్ర కలకలం రేపాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది హత్యలు చేశారు. వాటిలో సారూప్యం కూడా ఉంది.  మునావర్ హరూన్ షా, రాజేంద్ర జక్కల్, శాంతారామ్ జగతాప్, దిలీప్ సుతార్ పుణేలోని అభినవ్ కళా మహా విద్యాలయ కళాశాలలో చదువుకునేవారు. జల్సాలకు అలవాటు పడి దారి తప్పారు. వ్యసనాలకు బానిసలై, ఈజీమనీ కోసం హత్యలు, దోపిడీలకు తెగబడ్డారు. మొదట సహ విద్యార్థినిని కిడ్నాప్ చేసి చంపేశారు. ఆ తర్వాత ఇళ్లలో చొరబడి దోపిడీలకు పాల్పడి హత్యలు చేసేవారు. దోపిడీ చేశాక నోట్లో దూది కుక్కి, గొంతుకు నైలాన్ తాడు బిగించి చంపేవారు. 1976 నుంచి 77 మధ్యలో వీరి హత్యాకాండ కొనసాగింది. 

ఈ గ్యాంగ్ చేసిన 10 హత్యలు ‘జోషి-అభ్యాంకర్’ సీరియల్ హత్యలుగా పేరొందాయి. జోషి, అభ్యాంకర్ అనే వ్యక్తుల కుటుంబ సభ్యులను చంపడంతో ఈ పేరు వచ్చింది. హంతకులను పట్టుకోవడం మహారాష్ట్ర పోలీసులకు సవాల్‌గా మారింది. ఎట్టకేలకు నలుగురు దోషులను అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వీరికి ఉరిశిక్ష విధించింది. 1983 అక్టోబరు 25న పుణేలోని యెరవాడ జైలులో ఈ నలుగుర్ని ఒకే రోజు ఉరి తీశారు. ఆ తర్వాత దాదాపు 36 ఏళ్లకు.. ఈ నెల 22 ఒకే రోజు నలుగురికి ఉరి అమలు చేయనున్నారు.