కరోనాను జయించిన 10 లక్షల మంది.. ప్రపంచ లెక్కలు ఇవే - Telugu News - Mic tv
mictv telugu

కరోనాను జయించిన 10 లక్షల మంది.. ప్రపంచ లెక్కలు ఇవే

May 1, 2020

Latest Corona Cases in Indian

ప్రపంచంపై కరోనా విసిరిన పంజా నుంచి మెల్లమెల్లగా కోలుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 33,04,381 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10,39,144 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 20,31,398గా ఉన్నాయి. మరణాల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. మహమ్మారి దాడికి  2,33,839 మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్‌డౌన్, టెస్టుల సంఖ్య పెంచడం, ప్రజలను ఇళ్లకు మాత్రమే పరిమితం చేసే అంశాలు ఎంతో ఉపయోగపడ్డాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. 

ఇటు మన దేశంలో కరోనా కేసులు ఇంకా నమోదు అవుతూనే ఉన్నాయి. భారత్‌లో 35,043 మందికి పాజిటివ్ అని తేలింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1993 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. 8889 మంది డిశ్చార్జ్ కావడంతో ప్రస్తుతం కేసుల సంఖ్య  25,007గా ఉన్నట్టు  ప్రకటించింది. నిన్న ఒక్కరోజే దేశంలో 73 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో మరణాల సంఖ్య 1147కు చేరింది. మహారాష్ట్రలో మాత్రం కరోనా కల్లోలం సృష్టిస్తోంది. ఈ ఒక్క రాష్ట్రంలోనే ఏకంగా 10వేలకు పైగా మంది వ్యాధికి గురయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడులో ఎక్కువ కరోనా కేసులు నమోదవుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణలో కేసుల సంఖ్య తగ్గుతుండగా.. ఏపీలో మాత్రం మార్పు కనిపించం లేదు. అక్కడ రోజు రోజుకు ఎక్కువగానే పాజిటివ్ అని తేలుతోంది. నిన్న తెలంగాణలో 22 మందికి కొత్తగా కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కేసుల సంఖ్య 1038కి చేరగా.. మరణాల సంఖ్య 28కి చేరింది. ముగ్గురు వ్యక్తులు నిన్న వైరస్ కారణంగా మరణించారు. 442 మంది కోలుకోగా ప్ర‌స్తుతం 568 మంది గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అటు ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా మరో  71 కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ కేసుల సంఖ్య 1,403కు చేరింది. కర్నూలు జిల్లా 400 కేసులకు దగ్గరగా వచ్చింది.