మందు కొట్టి బండి నడపొద్దురా బాబూ అని ఎంత మొత్తుకుంటున్నా కొందరు వినడం లేదు. డ్రంక్ డ్రైవింగ్‌తో ప్రజల ప్రాణాలను తీస్తుండడమే కాక గోడలకు, డివైడర్లకు గుద్దుకుని తామూ చచ్చిపోతున్నారు. ఎన్ని శిక్షలు, ఎంత జరిమానా వేసినా దారికి రావడం లేదు. మన దేశంలోనేకాదు, ప్రపంచమంతా ఇదే సమస్య. అయితే శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు పోలీసులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త శిక్షలు విధిస్తుంటారు. యూరప్ దేశం లాత్వియాలో అలాంటి కొత్త రూల్ ఒకటి వచ్చింది. తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడే సదరు వాహనాలను జప్తు చేసిన యుద్ధంతో సర్వనాశనం అవుతున్న ఉక్రెయిన్‌కు పంపిస్తున్నారు. అలా స్వాధీనం చేసుకున్న 1200కుపైగా కార్లను ఉక్రెయిన్ సైన్యానికి అందించారు. దీంతో మందుబాబులు కాస్త దారికి వస్తున్నారు.
ఒక పర్యాయం కన్నా ఎక్కువసార్లు మద్యం పుచ్చుకుని వాహనం నడిపితే కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపుతున్నారు. జరిమానా కడతాం మా కారు మాకు ఇవ్వండని అడిగితే, అది ఉక్రెయన్ ఆర్మీకి ఇచ్చేశాం అని చెబుతున్నారు. కొత్త రూల్ ప్రకారం.. వాహన చోదకులు రెండు నెలల వ్యవధిలో రక్తంలో ఆల్కహల్ పర్సెంటేజ్ 0.15 శాతం కన్నా ఎక్కువతో దొరికితే ఈ రూల్ అమలు చేస్తున్నారు. జైడాట్ ఎన్వీ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో ఉక్రెయిన్ కు పంపిస్తున్నా. ఆ దేశ ఆర్మీ వాటిని తమ యుద్ధ అవసరాలకు తగ్గట్టు మార్చుకుంటోంది. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ సైన్యానికి చెందిన వేలాది వాహనాలు ధ్వంసమైన నేపథ్యంలో మందుబాబుల బండ్లు ఉడతా సాయంగా పనికొస్తున్నాయి.