చట్టాలను అమాయకులకు రక్షణ కల్పించే కవచాల్లా ఉపయోగించాలే తప్ప వారిని బెదిరించే కత్తుల్లా వాడకూడదని సుప్రీంకోర్టు హితవు పలికింది. తప్పుడు కేసులతో చట్టం పవిత్రతను దెబ్బతీసేలా, చట్టాల స్వభావాన్ని వక్రీకరించేలా ప్రయత్నాలను అడ్డుకోవాలని కింది కోర్టులకు సూచించింది. తమపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని ఇద్దరు నిందితులు దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా జస్టిస్ కృష్ణ మురారి, ఎస్ఆర్ భట్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులపై 2017లో నార్కొటిక్స్ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. తమపై కేసులను కొట్టేయాలని వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. నిందితులపై ఆరోపణ చేసిన సమయానికి, ప్రాథమిక విచారణకు మధ్య నాలుగేళ్ల విరామం ఉందని గుర్తించింది.
2013 నవంబర్‌లో డ్రగ్ ఇన్స్పెక్టర్.. నిందితుల్లో ఒకరి కెమికల్ కంపెనీపై దాడులు జరిపారు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించారని 2016 మార్చిలో కంపెనీ యజమానికి షోకాజ్ మెమో జారీచేశారు. దీంతో తమపై నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయమని వారిద్దరూ మద్రాస్ హైకోర్టును 2021 ఆగస్టులో ఆశ్రయించగా.. వారి పిటిషన్‌ను తిరస్కరణకు గురైంది. దీంతో వారిద్దరూ ఇటీవల సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఈ పిల్‌పై విచారణ జరిపిన ధర్మాసనం.. 2017లో వ్యాపారవేత్తపై కేసు నమోదైనట్లు తెలిపింది. ప్రాథమిక విచారణకు, కేసు నమోదు చేయడానికి మధ్య నాలుగేళ్ల వ్యవధి ఉందని ప్రస్తావించింది. ఆలస్యంగా నమోదు చేసిన ఫిర్యాదులోనూ సరైన ఆధారాలు లేవని తెలిపింది. ఇంత సమయం ఉన్నా దర్యాప్తు విభాగం ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయిందని తెలిపింది. కేసుల వెనుక దురుద్దేశాలు ఉన్నాయన్న అనుమానం కలుగుతోందని అభిప్రాయపడింది. నిందితులపై కేసును కొట్టివేస్తూ.. నిందితులను వేధించడానికి చట్టాన్ని ఉపయోగించుకోవద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది.