అయ్యోపాపం.. అక్కడ వృద్ధులకు శాపంగా మారిన కరోనా  - MicTv.in - Telugu News
mictv telugu

అయ్యోపాపం.. అక్కడ వృద్ధులకు శాపంగా మారిన కరోనా 

April 5, 2020

Leaked document reveals how Catalonian doctors are treating the elderly in hospital

ముట్టుకుంటే అంటుకుంటానంటున్న కరోనా మహమ్మారితో ప్రపంచవ్యాప్తంగా ఎందరో బలి అవుతున్నారు. ఇప్పటికే మనుషుల మధ్య సామాజిక దూరం అంటూ అంటరాని వాళ్లను చేస్తోంది. అది చాలదన్నట్టు ఇప్పుడు పెద్దవాళ్లను అన్యాయంగా మట్టుబెడుతోంది. కరోనా మహమ్మారి పడగవిప్పి మృత్యుగీతం ఆలపిస్తున్న దేశాల్లో ఇప్పుడు ఇటలీ, స్పెయిన్, అమెరికాలు ఉన్నాయి. అక్కడ పరిస్థితులు చాలా దారుణంగా తయారయ్యాయి. ఇటలీలో వృద్ధులకు కరోనా సోకితే పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. జీవితాన్ని చూసిన వృద్ధులు బతికితే ఎంత బతకకపోతే ఎంత అని నిర్దయగా వాళ్లకు చికిత్స చేయడంలేదు. యువతనే ఆదుకుంటున్నారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు స్పెయిన్‌‌లో దాపురించింది. అక్కడ ఏ ఆసుపత్రి చూసినా రోగులతో క్రిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఉన్న వైద్య సిబ్బంది కూడా సరిపోక చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 

దీంతో అక్కడి వైద్యులు వృద్ధులకు వైద్యం చేయం అంటున్నారు. ఐసీయూల్లో ఇతర వయసుల వారికి తగినంత స్థలం ఉంచాలన్న ఉద్దేశంతోనే వృద్ధులను చేర్చుకోవడంలేదు. ఇక, అక్కడి వృద్ధాశ్రమాల్లో పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. వారిని చూసుకునే సిబ్బంది లేకపోవడంతో ఆలనాపాలనా కరవై అత్యంత దయనీయ పరిస్థితుల్లో వారు చనిపోతున్నారు. కాగా, ‌‌స్పెయిన్‌లో ఇప్పటివరకు కరోనా బాధితుల సంఖ్య 1.26 లక్షలకు చేరగా.. 11,947 మంది మృతిచెందారు.