Leave Congress and will join BJP: Marri Shasidhar Reddy
mictv telugu

నాతో పాటు చాలా మంది పార్టీ వీడుతారు – మర్రి శశిధర్ రెడ్డి

November 19, 2022

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. కార్యకర్తలు, నాయకులతో చర్చించి మూడు నాలుగు రోజుల్లో కండువా కప్పుకుంటానని తెలిపారు. ఈ మేరకు అమిత్ షాతో చర్చించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కాన్సర్ సోకిందని, అది ఇప్పుడు నయం కాని స్టేజికి చేరందన్నారు. టీఆర్ఎస్‌ని ఎదిరించే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి వ్యవహార శైలిపై మండిపడ్డారు. మునుగోడు ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి పది కోట్లు ఖర్చు పెడతానని మోసం చేశారని, మొత్తం ఖర్చు ఇంచార్జీలతోనే పెట్టించారని ఆరోపించారు. డబ్బు ఖర్చు పెట్టకుంటే టిక్కెట్లు, పదవులు ఇవ్వనని బెదిరించారన్నారు.

నలుగురు చెంచా గాళ్లతో పార్టీని నడిపిస్తున్నారని, కాంగ్రెస్ నేతలకు రేవంత్ అందుబాటులో ఉండరని విమర్శించారు. తనలాగే త్వరలో చాలా మంది పార్టీని వీడతారని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఓ 15 మందిని గెలిపించుకొని సొంత దుకాణం పెట్టాలని రేవంత్ ఆలోచిస్తున్నట్టు బాంబు పేల్చారు. పీసీసీని రేవంత్‌‌కి ఇవ్వొద్దని చెప్పినా అధిష్టానం వినలేదన్నారు. అటు శశిధర్ రెడ్డి పార్టీ మారడంపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. దీనికి రేవంత్, భట్టి విక్రమార్క సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మర్రి పార్టీని వీడడం నష్టమేనని అభిప్రాయపడ్డారు.