లెబనాన్ పేలుడు ఎఫెక్ట్.. ప్రధాని సహా మంత్రివర్గం రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

లెబనాన్ పేలుడు ఎఫెక్ట్.. ప్రధాని సహా మంత్రివర్గం రాజీనామా

August 11, 2020

Lebanon Govt Resigned Latest Incident

లెబనాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల బీరుట్ పేలుళ్ల ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం వైదొలిగింది. ఆ దేశ ప్రధాని హసన్ దియాబ్ సహా మొత్తం మంత్రి వర్గం తమ పదవులకు రాజీనామా చేశారు. మంత్రివర్గ భేటీ ముగిసిన తర్వాత ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజల నుంచి నిరసనలు, ఒత్తిడి పెరగడంతో తప్పుకోక తప్పలేదు. దీంతో ఈ పరిణామం అక్కడ సంక్షోభాన్ని మరింత పెంచింది. అంత  కంటే ముందే ముగ్గురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయగా, ప్రధాని కూడా వారి బాటలోనే నడిచారు. వెంటనే ఆ రాజీనామాలను అధ్యక్షుడు మైఖేల్ ఔన్‌కు పంపడంతో వెంటనే ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని దియాబ్‌ను కోరారు.

గత మంగళవారం లెబనాన్ రాజధాని బీరుట్‌లోని పోర్టు ప్రాంతంలో భారీ పేలుళ్లు చోటు చేసుకున్నాయి. అమ్మోనియం నైట్రెట్ నిల్వల చేసిన గోదాంలో విస్పోటనం జరగడంతో 160 మంది ప్రాణాలు కోల్పోయారు. 6 వేల మందికిపైగా గాయపడ్డారు. ఓ వైపు తీవ్ర ఆర్ధిక సంక్షోభం, దశాబ్దాల అవినీతి, అధికార దుర్వినియోగంతో సతమతం అవుతున్న సమయంలో ఈ పేలుడు ఘటన మరింత ప్రజాగ్రహానికి కారణమైంది. ఏకంగా  రాజధాని ప్రాంతం పూర్తిగా విధ్వంసానికి గురికావడంతో విమర్శలు వ్యక్తం అయ్యాయి. కాగా ఈ దుర్ఘటనతో మొత్తం ప్రభుత్వం రాజీనామా చేయడం ఆసక్తిగా మారింది.