వాట్సాప్ కాల్స్‌పై పన్ను వేసిన ప్రధాని రాజీనామా - MicTv.in - Telugu News
mictv telugu

వాట్సాప్ కాల్స్‌పై పన్ను వేసిన ప్రధాని రాజీనామా

October 30, 2019

రాజు తలుచుకుంటే దెబ్బలకేమి కొదవ అన్న చందంగా తయారైంది లెబనాన్ ప్రధాని సాద్ హరిరి పనితీరు. ఎడా పెడా  పన్నులు వేయస్తూ తన క్రూరత్వాన్ని బయటపెట్టుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో చక్రవర్తిలా వ్యవహరించి చివరికి తన పదవిని పోగొట్టుకున్నారు. వాట్సాప్ కాల్స్ వాడుతున్నా కూడా పన్నులు వేయడంతో ప్రజలు తిరుగుబాటు చేశారు. దీంతో ఆయన తన పదవికే రాజీనామా చేయాల్సి వచ్చింది. 

లెక్కకు మించిన అవినీతి, ఆర్థిక సంక్షోభం, నిత్యావసర ధరల పెరుగుదలతో లెబనాన్ తీవ్ర అప్పుల్లో కూరుకుపోయింది. దీంతో అక్కడి ప్రజలపై పన్నులు విధించి ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలని సాద్ హరిరి ఆశించారు. చివరకు ఈనెల 17న వాట్సాప్ కాల్స్‌పై కూడా పన్ను విధించారు. ఆయన చర్యలను ప్రజలు ఆమోదించలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఆ  దేశంలో గత 12 రోజులుగా బ్యాంకులు, విద్యాసంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. ప్రధాన రహదారులను దిగ్భందం చేయడంతో సరుకు రావాణాకు అంతరాయం ఏర్పడింది.

  Saad Hariri.

ఆందోళనకారులను అణచివేసేందుకు మిలటరీని రంగంలోకి దించినా వారు  కూడా చేతులెత్తేశారు. పరిస్థితి చేజారడంతో ఆయన తన పదవి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘లెబనాన్ దేశాన్ని ఆర్థికాభివృద్ధి చేసి పరిరక్షించేందుకు నా సహచరులు బాధ్యత తీసుకోవాలి. నేను రాజకీయంగా చివరి దశకు చేరుకున్నా. అందుకే నా పదవికి రాజీనామా చేస్తున్నా. నేను మీ వద్ద ఏది దాచదలుచుకోలేదు’ అంటూ వ్యాఖ్యానించారు.