Leena Manimekalai shared another picture in twitter
mictv telugu

వెనక్కి తగ్గని ‘కాళిక’ ఫేమ్.. మళ్లీ దమ్ము కొడుతున్న ఫొటో..

July 7, 2022

డాక్యుమెంటరీ పేరుతో కాళికా మాత సిగరెట్ తాగుతున్న పోస్టర్ వదిలి వివాదానికి కారణమైన లీనా మణిమేకలై తాజాగా మరింత రెచ్చగొట్టింది. ఈ సారి అధికార బీజేపీని టార్గెట్ చేసి మరో చిత్రాన్ని పోస్ట్ చేసింది. చిత్రంలో ఇద్దరు జానపద కళాకారులు ఉంటారు. వారిద్దరూ కూడా ప్రదర్శన అయ్యాక అలా నడుచుకుంటూ వెళ్తూ ధూమపానం చేస్తారు. ఈ చిత్రాన్ని షేర్ చేసిన లీనా ‘జానపద కళాకారులు ప్రదర్శనలు ఇచ్చిన తర్వాత ఏం చేస్తారో బీజేపీ ట్రోల్ ఆర్మీకి తెలియదు. ఈ చిత్రం నా సినిమాలోనిది కాదు. రోజువారీ గ్రామీణ భారతం నుంచి తీసుకుంది. సంఘ్ పరివార్ మత దురభిమానంతో దేశాన్ని నాశనం చేయాలనుకుంటోంది. అది అనుసరించే హిందూత్వ ఎప్పటికీ భారత దేశంగా మారదు’ అంటూ ఘాటుగా రాసింది. కాగా, ఇప్పటికే లీనా పోస్ట్ చేసిన చిత్రాన్ని ట్విట్టర్ బ్యాన్ చేసింది. కెనడాలో కూడా డాక్యుమెంటరీ ప్రదర్శన నిలిపివేస్తామని ఆగాఖాన్ సంస్థ ప్రకటించింది. దీనిపై ఇంతకు ముందు స్పందించిన లీనా ‘దేశం మొత్తం విద్వేషం నింపే యంత్రాంగానికి లొంగినట్టనిపిస్తోంది. నన్ను సెన్సార్ చేయాలనుకుంటున్నారు. ఈ పరిణామాలతో నేను సురక్షితంగా ఉన్నట్టు భావించడం లేదు’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, లీనా తమిళనాడులోని మధురైలో పుట్టి పెరిగింది. ఈమె చేసే ట్వీట్లకు కేరళ నుంచి పెద్ద ఎత్తున మద్ధతు లభిస్తోంది.