మహానగరాల్లో అద్దె ఇంటిని వెతకడం పెద్ద ప్రహాసనం. అందులోనూ బెంగళూరు వంటి నగరాల్లో మరింత కష్టం. పైగా అక్కడ అధిక సెక్యూరిటీ డిపాజిట్ డిమాండ్ ఎదుర్కోవాలి. ఆ కష్టాలను ప్రతిబింబించేలా ఒకతను వింత ప్రకటన చూశాడు. అదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఐటీ సిటీ బెంగళూరులో రోజురోజుకు పెరుగుతున్న అద్దెల గురించి వార్తలు వింటూనే ఉన్నాం. ప్రాపర్టీ రెంటల్, బైయింగ్ పోర్టల్ అయిన నో బ్రోకర్ నివేదిక ప్రకారం గత సంవత్సరం చాలా మెట్రో నగరాల్లో అద్దె సగటున 12 శాతం పెరిగాయని తేలింది. అందులో బెంగళూరులోనే అత్యధికంగా 16.7శాతం పెరిగాయని పేర్కొంది. అంతేకాదు.. గేటెడ్ హౌసింగ్ కమ్యూనిటీల్లో అద్దెలు 40శాతం వరకు పెరిగాయట.
ప్రకటనలో..
బెంగళూరులోని ఇందిరానగర్ లో అద్దెకు ఇల్లు దొరక్క ఒకతను తను పడుతున్న బాధను పాంప్లెట్ రూపంలో గోడకు అతికించాడు. దాని ఎవరో ఫోటో తీసి లింక్డ్ ఇన్ లో పెట్టారు. అయితే ఇందులో.. ‘ఎడమ కిడ్నీ అమ్మకానికి ఉంది. భూస్వాములు అడుగుతున్న సెక్యూరిటీ డిపాజిట్ మొత్తానికి డబ్బు కావాలి(తమాషాగానే..), కానీ నాకు ఇందిరానగర్ లో ఇల్లు కావాలి. ప్రొఫైల్ కోసం స్కాన్ చేయండి’ అని రాశారు. అంతేకాదు.. కింద క్యూఆర్ కోడ్ కూడా జత చేశారు. అయితే దీనికి చాలామంది స్పందించారు. ‘ఇందిరానగర్ లో ఇల్లు కావాలంటే ఒక కిడ్నీ సరిపోదు, రెండూ విక్రయించడి’ అని కామెంట్లు చేస్తున్నారు.
ఆ కళాశాల్లో మాత్రమే..
ఇటీవలి కాలంలో ఇంటి కోసం వెతుకుతున్న వారు చాలా సమస్యలు ఎదుర్కుంటున్నారు. బెంగళూరులో అయితే.. వచ్చేవారి కళాశాల వివరాలు, లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్ కూడా అడుగుతున్నారట. అంతేకాదు ఒక నివేదిక ప్రకారం.. బెంగళూరులోని ఒక వ్యక్తి ఇటీవల ఐఐఎమ్, ఐఐటీల నుంచి డిగ్రీ పొందలేదని ఇంటిని అద్దెకు ఇవ్వడానికి ఓనర్స్ తిరస్కరించారు. నిర్దిష్ట కళాశాల నుంచి వచ్చిన వారికి మాత్రమే ఫ్లాట్ ఇస్తామనడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.