Leftparties Super Strategy In 2023 Elections
mictv telugu

పాలేరులో ఎర్రజెండా..! స్కోప్ ఎంత?

November 14, 2022

కామ్రెడ్లు కారు ఎక్కారు. మునుగోడులో కారుని జోరుగా నడిపించారు. 2023 ఎన్నికలకు ఇప్పటినుంచే వ్యూహాలు మొదలయ్యాయి. సార్..కారు..కొడవళ్లు అంటూ…లెక్కలు వేసుకుంటున్నారు. ఈ దోస్తీ అసెంబ్లీ ఎన్నికలదాకా కొనసాగించాలని వామపక్షాలు నిర్ణయించాయి. పట్టున్న నియోజకవర్గాలపై కామ్రెడ్లు కసరత్తు చేస్తున్నారు. వామపక్షాలకు టీఆర్ఎస్ ఎన్నిసీట్లు ఇస్తుంది.? పాలేరులో ఎర్రజెండా ఎగరేస్తుందా?అసలు ఏ నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు పట్టు ఉంది?

కొడవళ్లల్లో కొత్త జోరు

ఎనిమిదేళ్లుగా వామపక్షాలు టీఆర్ఎస్‌కు దూరంగా ఉన్నాయి. ప్రభుత్వ విధానాలపై ఒంటికాలుపై లేచాయి. మునుగోడు ఉప ఎన్నిక కామ్రెడ్ల మనస్సు మార్చింది. కేసీఆర్ సూచనలు వారిని రూట్ మార్చాయి. ప్రగతిభవన్ సమావేశం మళ్లీ దోస్తీకి బాట వేసింది. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపుకోసం పనిచేసేలా చేసింది. టీఆర్ఎస్ గెలుపుకోసం వామపక్షాల కార్యకర్తలు శక్తివంచనలేకుండా పనిచేశారు. బై పోల్ టైమ్‌లోనే కేసీఆర్, వామపక్షనేతలకు మధ్య ఒప్పందం కుదిరిందట. అదే మునుగోడు ఒప్పందం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో చెరో రెండు సీట్లు ఇచ్చే విధంగా చర్చలు నడిచాయని తెలుస్తోంది.ఆ సీట్లలో పాలేరుపై సీపీఎం గురిపెట్టింది.

ఆ సీట్లపై కామ్రెడ్ల కన్ను…

కొత్తగూడెం, హుస్నాబాద్ , మునుగోడు, బెల్లంపల్లి, దేవరకొండ నియోజక వర్గాలపై సీపీఐ దృష్టి పెట్టింది. ఈ సెగ్మెంట్లలో ఎలాగైనా రెండింటిని తప్పకుండా దక్కించుకోవాలని చూస్తోంది. ఈ ప్రతిపాదనను కేసీఆర్ ముందుంచబోతోంది. దేవరకొండలో ఇంతకుముందు సీపీఐకి మంచి పట్టు ఉండేది. ఆ పార్టీ ఎమ్మెల్యేనే రవీంద్రనాయక్. ఆపరేషన్ ఆకర్ష్‌లో భాగంగా గులాబీ గూటికి చేరారు. ఇప్పుడు అదే సీటుపై సీపీఐ నజర్ పెట్టింది. మరి రవీంద్రనాయక్ పరిస్థితి ఏంటి? ఈసీటుని వదులుకోవడానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉంటుందా?మునుగోడుని ఎట్టిపరిస్థితుల్లోనూ గులాబీ వదులుకోలేదు.మిగిలింది కొత్తగూడెం, హుస్నాబాద్ , బెల్లంపల్లి నియోజకవర్గాలు.ఇందులో ఏదో రెండింటిని సీపీఐకి ఇచ్చే అవకాశం ఉంది. మరి ఆ రెండు సీట్లలో సీపీఐకి ఎంత పట్టుంది.?

పాలేరుపై సీపీఎం నజర్
పాలేరు, మధిర, నల్గగొండ, నకిరేకల్ , మిర్యాలగూడ సీట్లపై సీపీఎం కన్నేసింది. ఈ సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలని ఇప్పటినుంచే అడుగులు వేస్తోంది.కేసీఆర్‌ని ఒప్పించి పాలేరుని పక్కాగా చేజిక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. పాలేరులో సీపీఎంకు మంచి పట్టుంది. కానీ ఇదే నియోజకవర్గంపై టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు దృష్టి పెట్టారు. ఇక్కడి నుంచే పోటీ చేయాలని చూస్తున్నారు. మరోవైపు తుమ్మల పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన బీజేపీలో చేరుతారని ఊహాగానాలు వచ్చాయి. ఈమధ్య వాజేడులో జరిగిన ఆత్మీయ సమావేశంలో తుమ్మల పార్టీ మార్పుపై క్లారిటీ ఇవ్వలేదు.తుమ్మల బీజేపీ కాదు కాంగ్రెస్ లో అవకాశాలూ లేకపోలేదని కొందరు చెబుతున్నారు. అటు వైస్సార్ టీపీ అధ్యక్షురాలు కూడా పాలేరు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు.మొత్తానికి పాలేరు నియోజకవర్గంపై నేతల ఆలోచనలు తిరుగుతున్నాయి. ఈ సీటు దక్కించుకుని ఇక్కడ నుంచి కచ్చితంగా ఎర్రజెండా ఎగురవేస్తామని సీపీఎం కాన్ఫిడెంట్‌తో ఉంది.

కేసీఆర్ మదిలో ఏముందో..

మునుగోడు స్నేహం 2023 అసెంబ్లీ ఎన్నికలదాకా కంటిన్యూ అవుతుందా?దోస్తీ కొనసాగినా వామపక్షాలు అడిగిన సీట్లు సీఎం కేసీఆర్ ఇస్తారా? సీపీఐ, సీపీఎం అడిగిన సీట్లు ఇస్తే అక్కడ ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి?జంపింగ్ జపాంగ్ బెడద టీఆర్ఎస్ కు పక్కాగా ఉంటుంది. అసలే కమలం కాచుకుని కూర్చుంది. ఎక్కడ దొరికితే అక్కడ గాలం వేయడానికి..మరి సార్..కారు..కొడవళ్లు ఏం చేస్తాయో చూడాలి.