Legendary actor Kaikala Satyanarayana passes away, full details here
mictv telugu

కైకాల సత్యనారాయణ సినీ, రాజకీయ ప్రస్థానమిదే

December 23, 2022

టాలీవుడ్ మళ్లీ విషాదంలో మునిగింది. ఈ ఏడాదిలోనే కొన్ని రోజుల వ్యవధిలో దిగ్గజ నటులు కోల్పోయిన ఇండస్ట్రీ.. తాజాగా మరో విలక్షణ నటుడు మరణంతో కన్నీరుమున్నీరవుతోంది. నవరస నటనా సార్వభౌముడిగా పేరొందిన, సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణాన్ని తెలుగు సినీ పెద్దలతో పాటు అభిమానులూ జీర్ణించుకోలేకపోతున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల ఫిల్మ్‌నగర్‌లోని నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల అభిమానులు, సీనీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయన్ని ఉదయం 11 నుంచి ఫిల్మ్ నగర్లో ఉంచనున్నారు. రేపు మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

నాటకలంటే విపరీతమైన ఆసక్తి

కృష్ణా జిల్లా కౌతవరంలో 1935 జులై 25న పుట్టిన కైకాల.. గుడ్లవల్లేరులో ప్రాథమిక విద్య, గుడివాడలో కళాశాల విద్యను అభ్యసించారు. కాలేజీ డేస్ నుంచి కూడా నాటకాలంటే విపరీతమైన ఆసక్తి. విజయవాడ హనుమంతరాయ గ్రంథాలయంలో నాటకపోటీల్లో పాల్గొనేవారు. అలా 1952లో ఆచార్య ఆత్రేయ రాసిన నాటకం “ఎవరు దొంగ”ను ప్రదర్శించారు సత్యనారాయణ. ఆ నాటకాన్ని చూసిన సినీ దర్శకుడు గరికపాటి రాజారావు.. సినిమాల్లోకి రావాలని ఆహ్వానించారట. డిగ్రీ పూర్తైన తర్వాత.. మద్రాస్‌కు వెళ్లిన ఆయన.. ఎన్నో అవమానాలు, తిరస్కరణల తర్వాత.. దేవదాసు నిర్మాత డీఎల్ నారాయణ చందమామ బ్యానర్‌పై నిర్మించిన ‘సిపాయి కూతురు’లో నటించారు. చెంగయ్య దర్శకత్వంలో నటి జమున సరసన హీరోగా తెరపై మెరిశారు సత్యనారాయణ. అదే మొదటి సినిమా. కానీ ఆ సినిమా ఆశించినంత విజయాన్ని సాధించలేదు. ఎన్టీఆర్‌కు దగ్గర పోలికలుండటం చేత సత్యనారాయణ ఖాళీగా ఉండకుండా ఆయనకు డూపుగా చాలా సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్ తో కలిసి 101 చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. రాముడు-భీముడు వంటి ఎన్.టి.ఆర్. ద్విపాత్రాభినయ చిత్రాలలో ఆయనకు డూప్‌గా తన సామర్ధ్యం నిరూపించుకున్నారు.

కేరీర్‌లో అదే కీలక మలుపు

1960లో ఎన్టీఆర్‌ చొరవతోనే మోడరన్‌ థియేటర్స్‌ వారి ‘సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి’ చిత్రంలో నటుడిగా అవకాశాన్ని అందుకున్నారు. ఆ సినిమా దర్శకుడు ఎస్డీ లాల్ విఠలాచార్య శిష్యుడు కావటంతో.. సత్యనారాయణలో ఉన్న ట్యాలెంట్‌ను గుర్తించి విఠలాచార్యకు పరిచయం చేశారు. అదే సత్యనారాయణ కెరీర్‌లో కీలక మలుపు. హీరో వేషాల కోసం వేచి చూడకుండా విలన్ లు తక్కువగా ఉన్న ఇండస్ట్రీలో కొరతను తీరుస్తూ అవకాశాలను అందుకోవాలని విఠలాచార్య ఇచ్చిన సలహాను సత్యనారాయణ స్వీకరించారు.

ఆయన ప్రస్థానమిదే

కైకాల సత్యనారాయణ నటించిన మొదటి చిత్రం సిపాయి కూతురు కాగా, చివరి చిత్రం మహర్షి. 200 మందికి పైగా దర్శకులతో కైకాల పని చేసారు. 2014లో రఘుపతి వెంకయ్య అవార్డును, 2017లో జీవన సాఫల్య పురస్కారం దక్కించుకున్నారు. కైకాల నటించిన బంగారు కుటుంబం(1994)కు నంది అవార్డు దక్కింది. పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద చిత్రాల్లో ఎన్నో పాత్రలు పోషించిన కైకాల.. 28 పౌరాణిక, 51 జానపద, 9 చారిత్రక చిత్రాల్లో నటించారు. 200 మందికిపైగా దర్శకులతో పనిచేశారు. ఆయన నటించిన 223 చిత్రాలు 100 రోజులు ఆడాయి. యమగోల, యమలీల చిత్రాల్లో యముడిగా అలరించారు. పౌరాణికాల్లో రావణుడు, దుర్యోధనుడు, యముడు, ఘటోత్కచుడు పాత్రలు పోషించారు. రమా ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థను స్థాపించిన కైకాల.. కొదమ సింహం, బంగారు కుటుంబం, ముద్దుల మొగుడు చిత్రాలను నిర్మించారు.

1996లో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన కైకాల సత్యనారాయణ.. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. కైకాల మరణంతో సినీ పరిశ్రమ ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఇదే ఏడాది కృష్ణంరాజు, కృష్ణ వంటి వారిని కోల్పోయిన తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు మరో పెద్ద దిక్కును కోల్పోయింది.