సరిహద్దుల్లో చాలా కోల్పోయాం : ఎస్పీ సంచలన నివేదిక!
తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దు వద్ద 26 గస్తీ పాయింట్లను కోల్పోయామని లేహ్ ఎస్పీ పి.డి. నిత్య కేంద్రానికి నివేదించారు. ‘కారకోరం పాస్ నుంచి చుమూర్ వరకు మొత్తం 65 పెట్రోలింగ్ పాయింట్లు ఉండగా వీటిల్లో సాయుధ బలగాలు గస్తీ నిర్వహించాలి. కానీ 26 చోట్ల (5 నుంచి 17, 24 నుంచి 32, 37) పాయింట్ల వద్ద మన బలగాలు గస్తీకి వెళ్లలేకపోతున్నాయి’ అని నివేదికలో వెల్లడించారు. గతవారం ఢిల్లీలో జరిగిన పోలీస్ బాస్‌ల సమావేశంలో ఈ నివేదిక కేంద్రానికి సమర్పించగా, ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, భద్రతా సలహాదారు అజిత్ దోభల్ పాల్గొన్నారు.
ఆయా ప్రాంతాల్లో గస్తీ లేకపోవడాన్ని సాకుగా చూపి చైనా ఆ భూభాగాలను తనలో కలిపేసుకుంటోందని నివేదికలో పేర్కొన్నారు. బఫర్ జోన్లను క్రియేట్ చేసి సలామీ స్లైసింగ్ పద్ధతిలో ఆక్రమించుకుంటోందని హెచ్చరించారు. ‘ఎత్తైన శిఖరాలు, పర్వతాలపై కెమెరాలను అమర్చి మన దళాల కదలికలను పసిగడుతోంది. బఫర్ జోన్‌లోకి సాయుధ బలగాలు ప్రవేశించిన వెంటనే అభ్యంతరం చెప్తూ ఆ భూభాగం తనదిగా వాదిస్తోంది. తర్వాత మరింత బఫర్ జోన్ అని చెప్తూ మనల్ని వ్యూహాత్మకంగా వెనక్కి నెడుతోంది’ అంటూ అక్కడి పరిస్థితులను విశ్లేషించారు.