మండే వేసవిలో నిమ్మకాయల ధర సామాన్యుడికి చెమటలు పట్టిస్తున్న వేళ పంజాబ్‌లో నిమ్మకాయల కుంభకోణం వెలుగుచూసింది. ఆ రాష్ట్రంలోని కపుర్తలా మాడ్రన్ జైలులో నిమ్మకాయల స్కాం జరిగినట్లు అధికారులు గుర్తించి.. అందుకు కారణమైన జైలు సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేశారు. మార్కెట్లో కిలో నిమ్మకాయల ధర దాదాపు రూ.200లకు పైగా పలుకుతుండటంతో ఇదే అదునుగా భావించిన జైలు అధికారులు వాటిని కొనకుండానే కొన్నట్టుగా రికార్డుల్లో చూపించి అడ్డంగా బుక్కైపోయారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు తేలడంతో జైలు సూపరింటెండెంట్ గుర్నామ్ లాల్‌ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జైలు రికార్డుల్లో రూ.200 చొప్పున 50 కిలోల నిమ్మకాయలు రూ.1,00,000 కు కొన్నట్లు చూపించారు.
ఈ విషయం అధికారుల బృందం జైల్లో తనిఖీలకు వెళ్లినప్పుడు వెలుగులోకి వచ్చింది. జైల్లో ఖైదీలు తమకు అందించే రేషన్‌లో నిమ్మకాయలు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంలో మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ దృష్టికి వెళ్లడంతో ఆయన జైలు సూపరింటెండెంట్‌పై విచారణకు ఆదేశించారు. అవకతవకలు జరిగినట్లు దర్యాప్తులో తేలడంతో జైలర్ గుర్నామ్ లాల్‌ను సస్పెండ్ చేశారు. ఒక్కొక్క చపాతీ బరువు కూడా 50 గ్రాముల కన్నా తక్కువ బరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కూరగాయల ఖరీదులోనూ అక్రమాలు జరిగినట్లు పసికట్టారు.