తల్లిపాలు తాగుతున్న పిల్లాడిని చంపేసిన పులి - MicTv.in - Telugu News
mictv telugu

తల్లిపాలు తాగుతున్న పిల్లాడిని చంపేసిన పులి

September 30, 2019

తల్లి ఒడిలో కూర్చొని పాలు తాగుతున్న మూడేళ్ళ పసివాణ్ణి చిరుతపులి నోటకరుచుకుపోయింది. ఈ దారుణం ఉత్తరాంచల్‌లోని పిథౌర్‌గఢ్‌ జిల్లా బెరీనాగ్ తహసీల్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానిక మలెతా గ్రామంలో నివసిస్తున్న హేమాదేవికి నైతిక్ కార్క్ అనే మూడేళ్ల కొడుకున్నాడు. నైతిక్‌కు ఆకలిగా ఉండడంతో అతడిని ఒడిలో కుర్చోబెట్టుకొని హేమాదేవి గ్లాసుతో పాలు పట్టిస్తోంది. ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో తెలీదు.. ఓ చిరుత పులి వారి ఇంట్లోకి ప్రవేశించి హేమాదేవి ఒడిలో ఉన్న నైతిక్‌పై దాడి చేసింది. 

uttaranchal.

దీంతో తల్లి పెద్దగా కేకలు వేయటంతో చుట్టుపక్కల వారంతా వచ్చారు. పిల్లాడిని నోటితో పట్టుకుపోతున్న చిరుతను చూశారు. కత్తులు, కర్రలు చేత పట్టుకొని పెద్దగా అరుస్తూ.. చిరుతను వెంబడించారు. అలా  కొంత దూరం వెళ్లిన ఆ చిరుత గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అరుస్తూ వస్తూండటంతో బాలుడిని రోడ్డుపై వదిలేసి పరుగెత్తిపోయింది. ఆ పసివాడి మెడ, చేతులకు తీవ్రంగా గాయాలయ్యాయి.. దీంతో వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా రక్తస్రావం కావటంతో ఆ బాలుడు మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు. బాలుడి మరణంతో ఆగ్రహం చెందిన గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. తన కళ్లముందే బిడ్డను ఓ క్రూర మృగం దాడిలో చనిపోవటంతో కడుపు కోతతో ఆ తల్లి రోదిస్తోంది. గ్రామస్థుల ఆందోళనతో గ్రామంలో అటవీశాఖ అధికారులు చిరుతను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు.