వీధికుక్కపై చిరుత ప్రతాపం - MicTv.in - Telugu News
mictv telugu

వీధికుక్కపై చిరుత ప్రతాపం

September 11, 2017

మన వీధిలోకి ఓ చిరుత పులి వచ్చి అలా షికారు కొట్టిపోయిందనుకోండి.. ఏమవుతుంది? పెద్దవార్త అవుతుంది కదా. కానీ ముంబై శివారు ములుంద్ లోని టీక్వుడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ వారికి మాత్రం ఇలాంటి సీన్లు చాలా మూమూలు. ఈ నెల 5వ తేదీన ఓ చిరుతపులి సొసైటీలోని ఓ వీధిలోకొచ్చింది. షికారుకు కాదండోయ్.. ఆహారం కోసం..!  ఆ సమయంలో రోడ్డుపై మనుషులెవరూ లేరు. లైట్లు మాత్రం వెలిగిపోతున్నాయి. అయినా చిరుత బెదిరిపోకుండా తన పని తాను చేసుకుపోయింది.

ఓ వాహనం పక్కన తన మానాన తాను పడుకుని ఉన్న కుక్కపై ప్రతాపం చూపింది. కుక్కను గొంతుకొరికి చంపేసి నోట కరచుకుని తాపీగా వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమరాలో రికార్డయ్యాయి. దగ్గర్లోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ నుంచి పులులు తరచూ వస్తుంటాయి. ఈ ప్రాంతంలో చిరుత పులులు తిరగడం మామూలేనని, ప్రజలు పెద్దగా భయపడాల్సిన పనేమీ లేదని పోలీసులు చెప్పుకొస్తున్నారు.

వాళ్లదగ్గరైతే తుపాకులు ఉంటాయి కాబట్టి అలా చెబుతారని, వాటిని చూస్తుంటే తమ ప్రాణాలు పైనే పోతున్నాయని స్థానికులు అంటున్నారు.