బావిలో పులి, బోను.. తప్పక చూడాల్సిన సీన్ - MicTv.in - Telugu News
mictv telugu

బావిలో పులి, బోను.. తప్పక చూడాల్సిన సీన్

October 8, 2018

ప్రమాదవశాత్తు ఓ చిరుతపులి బావిలో పడింది. అది కూడా ఏకంగా 30 అడుగుల లోతున్న నీళ్ల బావిలో. అందుకే దానికి ఎలాంటి గాయాలు కాలేదు. కానీ అంత లోతైన బావిలోంచి అదెలా బయటపడింది? తాళ్లతో బయటికి తీశారా? క్రేన్ పెట్టారా? ఉహూ..! మరేం చేశారు?

మహారాష్ట్రలోని ఓటూర్ రేంజ్‌లోని యాదవ్వాడిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పులి బావిలో పడిందన్న విషయాన్ని స్థానికులు పోలీసులకు, ఫారెస్టు అధికారులకు తెలిపారు. బావి వద్దకు చేరుకున్న ఫారెస్ట్ డిపార్ట్ మెంట్, వైల్డ్‌లైఫ్ ఎస్‌వోఎస్ సిబ్బంది ఎంతో చాకచక్యంగా వ్యవహరించారు. ఏడేళ్ల వయసున్న ఆ ఆడచిరుతను బయటికి తీసుకురావడానికి మొదటి నిచ్చన వేశారు. పులి ఆ నిచ్చెన ఎక్కింది. తర్వాత ఓ బోనును తాళ్లతో కట్టి బావిలోకి దింపారు. నీళ్లలోంచి బయటపడితే చాలురా దేవుడా అనుకుంటున్న పులి చటుక్కున బోనులోకి వెళ్లిపోయింది. సిబ్బంది వెంటనే బోను తలుపు మూసేసి, బోనును పైకి తీసుకొచ్చారు. తర్వాత రెస్క్యూ హోంకు తీసుకెళ్లారు. పులికి ఎలాంటి గాయాలూ కాకుండా బయటికి తీసుకొచ్చినందుకు జనం అధికారులను మెచ్చుకుంటున్నారు.