తెలంగాణలో చిరుత పులులు కలకలం సృష్టిస్తున్నాయి. ఓ వైపు ఎండలు ఎక్కువగా ఉండటం.. పంట పొలాలకు ప్రజలు వెళ్లక అలికిడి లేకపోవడంతో అడవుల నుంచి ధైర్యంగా బయటకు వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ నగర శివారుల్లో నడిరోడ్డుపై చిరుత గాయపడి కనిపించి కలకలం సృష్టించగా.. తాజాగా నల్గొండ జిల్లాలో మరో చిరుత కనిపించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
మర్రిగూడ మండలం రాజాపేట్ తండాలో కొంత మంది రైతులు అడవి పందుల కోసం ఉచ్చు ఏర్పాటు చేశారు. దానికి బుధవారం రాత్రి ఓ చిరుత అటుగా వెళుతూ చిక్కుకుపోయింది. ఉదయాన్నే రైతులు వెళ్లి ఉచ్చులను పరిశీలించగా.. చిరుత కనిపించింది. వెంటనే రైతులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ సిబ్బంది దాన్ని ఉచ్చు నుంచి తప్పించి అడవిలో విడిచిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానికంగా వన్యమృగాల సంచారం గురించి తెలిసి ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు.