ఫిబ్రవరి 14 అనగానే ఠక్కున వాలెంటైన్స్ డే అనేస్తారు. కానీ ఈరోజున మరికొన్ని ప్రముఖ రోజులు కూడా ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి ప్రపంచమంతా ప్రేమికుల రోజును జరుపుకొంటున్నది.
కొన్ని తేదీలు చెప్పగానే అవే రోజులు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 14 అంటే వాలెంటైన్స్ డే అనేంతగా మారిపోయింది. కానీ ఈరోజున ముఖ్యమైన చారిత్రాక సంఘటనలు జరిగాయి. అవేంటో వాటి ఔచిత్యమేంటో తెలుసుకోండి.
బ్లాక్ డే :
2019 ఫిబ్రవరి 14న.. జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో సైనిక వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 40మంది సీఆర్పీఎఫ్ సభ్యులు మరణించారు. ‘జైష్-ఎ-మహ్మద్’ అనే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ ఈ దాడికి కారణం. ఈ రోజున ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్లను దేశం స్మరించుకొని బ్లాక్ డే గా జరుపుకొంటున్నది.
బుక్ గీవింగ్ డే :
ఇప్పటి పిల్లలు క్లాసు పుస్తకాలు తప్ప వేరే పుస్తకాలు పట్టిన దాఖలాలు ఉండడం లేదు. పెద్దవాళ్లు కూడా కంప్యూటర్లు, ట్యాబ్స్ వచ్చాక ఇతర పుస్తకాలు చదువడం తగ్గించేశారు. కానీ పుస్తకాలు చదువడం అలవాటు. ఈ రోజును అంతర్జాతీయ పుస్తక వితర దినోత్సవంగా జరుపుతారు. వీలైనంత ఎక్కువమందికి సరికొత్తగా, ఉపయోగించిన లేదా అరువుగా తీసుకొని పుస్తకాలను చదువమని ప్రోత్సహించడమే ఈ రోజు లక్ష్యం.
లైబ్రరీ లవర్స్ డే :
ఈ రోజు పుస్తక ప్రియులను గౌరవించే రోజు. లైబ్రరీ ఒక అద్భుతమైన లోకం. జీవితాన్ని మార్చే పుస్తకాలు, పాఠాలు ఇక్కడే దొరుకుతాయి. 2006లో ఆస్ట్రేలియాలోని స్టేట్ లైబ్రరీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్ ఈ రోజును మొదలు పెట్టింది. ప్రతీ సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. మరి ఈ సంవత్సరం.. ‘మీరు మాత్రమే ప్రపంచాన్ని సరైనదిగా చూపగలరు, మీరు మాత్రమే చీకటిని ప్రకాశవంతంగా మార్చగలరు’.
ఆర్థిక అక్షరాస్యత వారం :
భారతీయుల్లో ఆర్థిక విద్యపై అవగాహన కల్పించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) ఏటా ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని(ఎఫ్ఎల్ డబ్ల్యూ)నిర్వహిస్తుంది. ఫిబ్రవరి 13 నుంచి 17 వరకు ఈ వారోత్సవం జరుగుతుంది. 2023 థీమ్.. ‘మంచి ఆర్థిక ప్రవర్తన- మీ రక్షకుడు’. వ్యక్తిగత ఫైనాన్స్, బడ్జెటింగ్, ఆన్ లైన్ సేవల బాధ్యతాయుత వినియోగం గురించి జ్ఞానాన్ని ప్రోత్సహించడం పై ప్రాధాన్యత ఉంటుంది.