నా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి.. గవర్నర్‌కు తల్లి లేఖ - MicTv.in - Telugu News
mictv telugu

నా బిడ్డ కారుణ్య మరణానికి అనుమతివ్వండి.. గవర్నర్‌కు తల్లి లేఖ

August 30, 2019

letter ....

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు రోగుల పట్ల అమానవీయంగా తయారయ్యారు. తన కుమార్తెకు వైద్యం చేయమని వైద్యులు చేతులు ఎత్తేశారు. దీంతో ఆ తల్లి తన కుమార్తెను చంపుకోవాలని నిర్ణయించింది. కూతురు తన కళ్ల ముందు పడుతున్న నరకం కన్నా చనిపోయిందే నయం అనుకుని ఆ తల్లి తన బిడ్డ పట్ల మనసు కఠినం చేసుకుంది. 

ఈ నేపథ్యంలో తన కన్నబిడ్డ కారుణ్య మరణానికి అనుమతి కోరుతూ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కి వినతిపత్రం అందించారు. 

విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన స్వర్ణలత కూతురు జాహ్నవి నాలుగో ఏటనే అరుదైన మానసిక వ్యాధికి గురైంది. ఎనిమిదేళ్ల వయసులో గైనిక్ సంబంధిత ఆరోగ్య సమస్యలూ తలెత్తాయి. ఈ నేపథ్యంలో వైద్య చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రిలోని గైనిక్ విభాగంలో ఆమెను చేర్చారు. అప్పటినుంచి ఆమెకు అక్కడే చికిత్స చేయిస్తున్నారు. అయితే గత కొంతకాలంగా జాహ్నవికి వైద్యం అందించేందుకు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు నిరాకరిస్తున్నారు. ఆమెకు వైద్యం చేయడం తమవల్ల కాదని చేతులు ఎత్తేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు తీసుకొచ్చినా వైద్యురాలు పట్టించుకోలేదని స్వర్ణలత ఆరోపించారు. 

వైద్యులు చికిత్సకు నిరాకరిస్తే ఇక నా బిడ్డ బతికి ఎందుకు? కూతురి పరిస్థితి చూసి తట్టుకోలేకనే కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నానని తల్లి స్వర్ణలత గవర్నర్‌ను ఆశ్రయించారు. కాగా, జాహ్నవి చికిత్స పొందుతున్న ఆసుపత్రిలోనే  ఆమె తండ్రి చిరుద్యోగిగా వున్నారని తెలుస్తోంది.