జాతీయ పార్టీ పెడదాం.. త్వరలోనే ప్రకటన: కేసీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

జాతీయ పార్టీ పెడదాం.. త్వరలోనే ప్రకటన: కేసీఆర్

June 11, 2022

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఓ సంచలన ప్రకటన చేయబోతున్నారు. గతకొన్ని నెలలుగా కేంద్ర ప్రభుత్వంపై, మోదీ పాలనపై నిప్పులు చెరిగిన ఆయన.. ఈ నెలలోనే నేషనల్ లెవల్‌లో కొత్త పార్టీని పెట్టబోతున్నారు. ఆ పార్టీకి భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరును ఖారారు చేశారు. ఈ నెల 19న జరగనున్న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీ విషయంలో తుది నిర్ణయాన్ని ప్రకటించనున్నట్టు పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు.

ఈ విషయంపై శుక్రవారం అందుబాటులో ఉన్న మంత్రులతో, ఎంపీలతో, పార్టీ నేతలతో ప్రగతి భవన్‌లో కేసీఆర్ సుదీర్ఘమైన చర్చ జరిపారు. దేశ రాజకీయ పరిస్థితులు, టీఆర్ఎస్ పోషించబోతున్న పాత్ర, దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ పలు అంశాలపై మంత్రులకు దిశానిర్ధేశం చేశారు. కేసీఆర్ ప్రతిపాదనకు నేతలు కూడా ఏకీభవించినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 19 లోగా కార్యవర్గ సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చే విషయంలో తుది నిర్ణయం ప్రకటించనున్నారని, నెలాఖరులో ఢిల్లీలో పార్టీని ప్రకటిస్తారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

“బీజేపీ ఆగడాలు పెరిగిపోయాయి. ఆ పార్టీ వల్ల దేశం అధోగతి పాలైంది. కాంగ్రెస్ విపక్షంగానూ విఫలమైనందున దేశ ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పాత్రను కొత్త పార్టీ పోషిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికలను ప్రత్యామ్నాయ జాతీయ శక్తి రూపకల్పనకు వేదికగా ఉపయోగించుకోవాలి. ఇదే సరైన సమయం. ఈ వ్యూహం అమల్లో భాగంగా జాతీయ రాజకీయాల్లో తెరాస మరింత చురుకుగా వ్యవహరిస్తుంది. తెలంగాణ పాలన, పథకాలకు దేశవ్యాప్తంగా స్పందన లభిస్తోంది. కేంద్రం దీన్ని జీర్ణించుకోలేక ఉద్దేశపూర్వకంగానే ఇబ్బంది పెడుతోంది. రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకునేందుకే రుణాలపై ఆంక్షలు విధిస్తోంది. దీనిని దీటుగా ఎదుర్కొందాం. భావసారూప్య పార్టీలతో సమావేశమై వ్యూహం రూపొందిద్దాం. తమిళనాడు, బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ గవర్నరు విశ్వవిద్యాలయాల ఉపకులపతి (ఛాన్సలర్) పదవి నుంచి తొలగించి, ఆ స్థానంలో ముఖ్యమంత్రికి అధికారాలు అప్పగించేందుకు అవసరమైన కార్యాచరణ చేద్దాం” అని కేసీఆర్ మాట్లాడినట్లు సమాచారం.