అమ్మ.. ఈ పదానికి ఎన్ని నిర్వచనాలు ఇచ్చినా తక్కువే. అమ్మ ప్రేమను వెలకట్టడం మన తరం కాదు. బిడ్డలను కని, పెంచడానికి ఆ తల్లి పడే పాట్లు ఎన్నో, ఎన్నెన్నో? పురిటినొప్పుల్లో ఆమె పడే ఒక్కో నొప్పికి మన జీవితమంతా ఆమెకు ఊడిగం చేసినా ఆ మూల్యం చెల్లించుకోలేం. అలాంటి అమ్మకు ఓరోజు ఉంది. అదే మే నెల రెండో ఆదివారం.. అంటే ఈ నెల 10న జరుపుకోబోయే మదర్స్ డే. అమ్మకు ప్రతిరోజూ ఆమెకు మనం కృతజ్ఞులుగానే ఉండాలి. ఆమె పంచిన ప్రేమను మనం నిత్యం ఆమెకు పంచాలి. అలాంటి మానవజాతి మనుగడకే ప్రాణం పోసిన మగువ భారతీయ మహిళ అంటే అతిశయోక్తి కాదు. నాటి నేటి వరకు సమాజ హితం కోసం ప్రసవం అనే ప్రాణ గండాన్ని దాటి ఓ బిడ్డకు జన్మనిచ్చినవారంతా వీరమాతలే. దేశంకోసం ఎందరో సైనికులకు ప్రాణం పోస్తున్న ఆ తల్లులే భారతమాతకు ముద్దుబిడ్డలు. క్రీస్తు పూర్వం నుంచే మన భారతీయ నారి శాంతి, సహనాల గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. ఈరోజున అలాంటి మాతామణులను గుర్తు చేసుకోవడం మన బాధ్యత.
యశోద
జగన్నాటక సూత్రధారి కృష్ణుడి పెంపుడు యశోదమ్మ బిడ్డని పెంచి తీర్చిదిద్దిన తీరు ఆసక్తికరంగానే కాకుండా సరదాగానూ ఉంటుంది. చిన్ని కృష్ణుడి అల్లరిని భరిస్తూనే అతణ్ని లోకకల్యాణ కారకుడిగా ఆమె రూపుదిద్దింది. కృష్ణుడికి పాలు, వెన్నల బలమే కాదు బుద్ధిని కూడా అందించింది. పిల్లాడ్ని గోపబాలురతో ఆటలకి పంపేది. అంటే పిల్లలంతా సమానమని, కృష్ణుడు వారిలో ఒకడని గొప్పింటి బిడ్డడ్ని అనే అహంకారం లేకుండా పెంచింది.
సుభద్ర
కళింగ యుద్ధంలో అశోక చక్రవర్తి మనసు మారడం వెనుక ఆయన తల్లి సుభద్ర పాత్ర కీలకం. తల్లి ప్రబోధించిన శాంతి పాఠాలతో అశోకుని గుండె కరిగి, యుద్ధానికి స్వస్తి పలికి బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఈయన పరిపాలనలో రాజ్యం చాలా సుభిక్షంగా ఉండేదనీ, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లేవారని చరిత్ర చెపుతోంది. అందులో తల్లి పాత్ర ఎంతో ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
ఇక భారతంలోని సుభద్రా సుతుడు అభిమన్యుడి గురించి మనందరికీ తెలిసిందే. అతడు గర్భంలో ఉండగానే తల్లిదండ్రుల సంభాషణను వింటాడు. అర్జునుడు, సుభద్రతో యుద్ధంలోని వ్యూహాల్ని గురించి ముచ్చటిస్తూ సైన్యాన్ని పద్మవ్యూహంలో ఎలా నిలపాలి అనే విషయంపై చర్చిస్తాడు. మాట్లాడుతూ ఆ మాటల్ని మధ్యలో ఎందువల్లనో ఆపినట్లు.. అందువల్ల అభిమన్యుడికి పద్మవ్యూహంలో ప్రవేశించడం మాత్రమే తెలిసినట్లు భారతంలో గమనిస్తాం.
మదాలస
రాణి మదాలస తన పుత్రులకు చిన్నతనంలోనే బ్రహ్మజ్ఞానం నేర్పింది. పిల్లలకు జోల పాటలతోనే జీవిత పరమార్ధం బోధించిన మహా మాతృమూర్తి మదాలస. ‘నువ్వు పవిత్రుడవు, స్వచ్ఛమైనవాడవు..నీకు ఈ భౌతిక శరీరం అన్నది శాశ్వతం కాదు. సంసార బంధాలు నీటిబుడగలు..’ అంటూ భారత తాత్వికతను ఉగ్గుపాలతో నేర్పుతుంది. ఆమె ప్రభావం భారత వేదాతంపై ప్రస్పుటంగా కనిపిస్తుంది. సత్యాన్వేషణ కోసం సర్వాన్ని పరిత్యాగం చేసిన శంకరాచార్యులు వంటి ఆధ్యాత్మికవేత్తలందరూ ఆమె నుంచి స్ఫూర్తి పొందిన వారే.
సీత
శ్రీరాముని ధర్మపత్న సీతను చల్లని తల్లి, సీతమ్మ తల్లి అని కీర్తిస్తారు ఓవైపు ధర్మపత్నిగా, మరోవైపు వీరమాతగా సీతమ్మ విరాజిల్లుతారు. దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు రాజ్యాన్ని త్యజించి 14 ఏండ్లు వనవాసానికి వెళ్ళవలసి వచ్చింది. రాముడు, అత్తలు వారించినా వినకుండా సీత పట్టు బట్టి ‘నిన్ను విడిచి నేనుండలేను. అడవులలో నీతో గడ్డిపై పడుకున్నా నాకు హంసతూలికా తల్పంతో సమానం. నేను నీకు ఇబ్బంది కలిగించను’ అని వాదించి రామునితో వనవాస దీక్ష అనుభవించడానికి బయలుదేరుతుంది సీత. లోకుల మాట విని రాముడు పరిత్యజించాక ఆమె వనవాసంలో లవకుశలకు జన్మనిస్తుంది సీతమ్మ. వారిని వీరాధివీరులుగా తీర్చి దిద్దడంలో సీత పాత్ర అమోఘమైంది. వాల్మీకి ద్వారా రామాయణాన్ని వింటారు. రాముడు అశ్వమేధయాగం చేయగా ఆ యాగాశ్వాన్ని లవకుశులు బంధిస్తారు. అప్పుడు జరిగిన ప్రతిఘటనలో రాముడికి, లవకుశలు తన బిడ్డలని తెలుస్తుంది. వారిని రామునికి అప్పగించి సీత భూమిలో ప్రవేశిస్తుంది.
జిజియా బాయి
మరాఠా వీరవనిత. శివాజీకి ఉగ్గుపాలతో ధైర్యసాహసాలను నూరిపోసింది. భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని గుర్తు చేసింది. బాల్యం నుంచి వీరుల కథలను చెబుతూ అతణ్ని దేనికీ భయపడని వీరుడిగా తీర్చిదిద్దింది. శివాజీ పెద్దయ్యాక యుద్ధవ్యూహాలు పన్నడం, మొగలాయి పాలకులతో దీటుగా పోరాడటం వెనుక జిజియా స్ఫూర్తి, ఆదర్శాలు కనిపిస్తాయి.
ఇలాంటి ఎందరో.. వీరమాతలు మనకు చరిత్రలో కనిపిస్తారు. స్వామి వివేకానంద, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, నెహ్రూ, మహాత్మాాగాంధీ వంటి మహనీయులు కూడా తల్లికే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. వారి అడుగు జాడల్లో నడిచారు. ‘నువ్వు విదేశాలకు వెళ్తే వెళ్లు. కానీ పరస్త్రీని చూడనని, మద్యం ముట్టనని నాకు మాట ఇవ్వాలి..’ అని ప్రమాణం చెయ్యమంటుంది గాంధీని అతని తల్లి. నీతి, న్యాయాలకు నిలబడ్డంలో తప్పులేదని మన తల్లులు తమ పిల్లలకు బోధిస్తే అవినీతి, అక్రమాలతో కునారిల్లుతున్న దేశం అభ్యున్నతి సాధిస్తుంది.