బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటాం: కవిత - MicTv.in - Telugu News
mictv telugu

బీజేపీతో తాడోపేడో తేల్చుకుంటాం: కవిత

April 11, 2022

 

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేసేవరకు ఉధృతంగా కొట్లాడుతామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంతేకాకుండా 24 గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే, తాడోపేడో తేల్చుకుంటామని ఆమె హెచ్చరించారు. ఢిల్లీలో సోమవారం కేసీఆర్ చేపట్టిన దీక్షలో కవిత పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ‘ఢిల్లీలో టీఆర్ఎస్ దీక్ష విజయవంతం అయింది. ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్ళు తెరవాలి. బీజేపీ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో తెలంగాణ రైతులతో కలిసి కొట్లాడుతాం. కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ రైతులకు అండగా నిలిచి న్యాయం జరిగే వరకు పోరాడుతాం” అని అన్నారు.

అనంతరం మోదీ ప్రభుత్వం రైతుల శక్తిని తక్కువగా అంచనా వేస్తోందన్నారు. ఢిల్లీలో తాము ధర్నా చేస్తుంటే, హైదరాబాద్‌లో బీజేపీ దొంగ దీక్ష చేస్తుందని విమర్శించారు. దేశవ్యాప్తంగా రైతులకు పంటకు పెట్టిన కనీస ఖర్చు కూడా రావడం లేదని, అయినా క్రూరమైన బీజేపీ ప్రభుత్వానికి రైతుల పట్ల కనీస సానుభూతి కూడా లేదని కవిత మండిపడ్డారు.