నెలనెలా అకౌంట్‌లోకి డబ్బులు.. ఎల్ఐసీ కొత్త పాలసీ - MicTv.in - Telugu News
mictv telugu

నెలనెలా అకౌంట్‌లోకి డబ్బులు.. ఎల్ఐసీ కొత్త పాలసీ

October 23, 2020

LIC launches New Jeevan Shanti deferred annuity plan

జీవిత బీమా సంస్థ ఎల్ఐసీ (లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) ఓ సరికొత్త పాలసీని ప్రవేశపెట్టింది. ‘న్యూ జీవన్ శాంతి’ పేరుతో డిఫర్డ్ యాన్యుటీ ప్లాన్‌ను వెల్లడించింది. నెల నెలా అకౌంట్‌లో డబ్బులు వచ్చేలా దీనిని రూపొందించింది. ఎల్ఐసీ గతంలో తీసుకొచ్చిన జీవన్ శాంతి పాలసీని 6,11,695 మంది తీసుకున్నారు. అదే పాలసీలో కొన్ని మార్పులు చేసి న్యూ జీవన్ శాంతి పాలసీని పరిచయం చేసింది. ఇది వ్యక్తిగత సింగిల్ ప్రీమియం ప్లాన్. ఈ పాలసీ ప్రారంభించినప్పుడు నిర్ణయించిన వడ్డీ రేట్లే అమలులో ఉంటాయి. ఈ ప్లాన్‌‌ను కనీసం 30 ఏళ్ల నుంచి 79 ఏళ్ల వ్యక్తులు తీసుకోవచ్చు. ఈ పాలసీకి లోన్ సదుపాయం కూడా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో పాలసీ సరెండర్ చేసి డబ్బులు వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. డిఫర్‌మెంట్ పీరియడ్ తర్వాత పాలసీదారుడికి ప్రతీ ఏటా జీవితాంతం యాన్యుటీ చెల్లిస్తారు. ఇదే ఈ పాలసీ ప్రత్యేకత. ఆన్‌లైన్‌‌లో ఈ పాలసీని తీసుకోవచ్చు. ఈ పాలసీని కనీసం రూ.1.5 లక్షలకు తీసుకోవాలి. యాన్యుటీ ప్రతి నెల, మూణ్నెల్లు, ఆరు నెలలు, ప్రతీ ఏటా చెల్లిస్తారు. కనీసం ఏడాదికి రూ.12,000 యాన్యుటీ లభిస్తుంది. రూ.5,00,000 కన్నా ఎక్కువకు పాలసీ తీసుకుంటే యాన్యుటీ ఇన్సెంటీవ్ లభిస్తుంది. మరోపక్క ఈ పాలసీలో రెండు రకాల యాన్యుటీ ఆప్షన్లు ఉంటాయి.

ఒకటేమో డిఫర్డ్ యాన్యుటీ ఫర్ సింగిల్ లైఫ్‌.. ఇందులో యాన్యుటీ పేమెంట్స్ పాలసీదారుడికి జీవితాంతం లభిస్తాయి. డిఫర్‌మెంట్ కాలంలో లేదా వారి మరణానంతరం డెత్ బెనిఫిట్‌ను నామినీకి చెల్లిస్తారు. ఇక రెండోది డిఫర్డ్ యాన్యుటీ ఫర్ జాయింట్ లైఫ్‌.. ఇందులో డిఫర్‌మెంట్ పీరియడ్ తర్వాత పాలసీదారుడు కోరుకున్నట్టుగా నెలకు లేదా ఏడాదికి ఓసారి డబ్బులు వస్తాయి. వారి మరణానంతరం ప్రైమరీ, సెకండరీ యాన్యుటెంట్‌ జీవించినంత కాలం యాన్యుటీ లభిస్తుంది. వారు కూడా మరణించిన తర్వాత డెత్ బెనిఫిట్ నామినీకి ఇస్తారు. డిఫర్‌మెంట్ పీరియడ్ 1 ఏడాది నుంచి 12 ఏళ్ల వరకు ఉంటుంది. గరిష్టంగా 80 ఏళ్ల వరకే డిఫర్‌మెంట్ పీరియడ్ వర్తిస్తుంది. దివ్యాంగులు ఈ ప్లాన్ తీసుకోవాలంటే కనీసం రూ.50,000 చెల్లించాల్సి ఉంటుంది. కాగా, ఎల్ఐసీలో జీవన్ అక్షయ్ VII పాలసీ కూడా ఇలాగే యాన్యుటీని ఇస్తుంది. వీటితో పాటు SIIP, నివేశ్ ప్లస్, న్యూ ఎండోమెంట్ ప్లస్ పేర్లతో యూలిప్ పాలసీలు వినియోగదారులను అలరిస్తున్నాయి.