Licence from cops must for Hyderabad shops
mictv telugu

ఇక నుంచి వ్యాపారులకు పోలీస్ లైసెన్స్ తప్పనిసరి.. మినిమం రూ.వెయ్యి

January 25, 2023

హైదరాబాద్ నగరంలో వ్యాపారాలు నిర్వహిస్తున్నవారంతా పోలీస్ లైసెన్స్ తీసుకోవాలనే నిబంధన అమల్లోకి రానుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఈ విధానం అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ట్రేడ్, పుడ్ లైసెన్స్, ఫైర్ ఎన్‌వోసీతో పాటు పోలీసు లైసెన్స్ తప్పనిసరి చేస్తూ హైదరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. 2014 తర్వాత లైసెన్స్‌లను సిటీ పోలీసులు రద్దు చేశారు. ఇప్పుడు తొమ్మిదేళ్ల తర్వాత పోలీస్ లైసెన్స్ నిబంధనలను మళ్లీ అమలు చేయాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు.

ఇటీవల నగరంలోని పలు వ్యాపార సంస్థల్లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల కారణంగా పలువురు మృత్యువాత పడుతున్నారు.ఈ నెల 19వ తేదీన సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంతో పోలీస్ లైసెన్స్ ను అమల్లోకి తీసుకు రావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఏ వ్యాపారం చేస్తున్నారు. ఎంతమంది పనిచేస్తారు, ఈ వ్యాపారానికి అవసరమైన మెటీరియల్ ఎక్కడి నుడి తెస్తారు,. అగ్నిమాపక శాఖతో పాటు ఇతర శాఖల లైసెన్స్ లు ఉన్నాయా అనే విషయాన్ని లైసెన్సులు జారీ చేసే సమయంలో పోలీసులు పరిశీలించనున్నారు.

ఈ లైసెన్స్ ను అమల్లోకి తీసుకువస్తే పోలీసుల వద్ద కూడా వ్యాపార సంస్థల సమాచారం ఉంటుంది. ఏదైనా ఘటన జరిగిన సమయంలో వ్యాపార సంస్థలకు సంబంధించిన సమాచారం పోలీసులు దర్యాప్తునకు మేలు కల్గించే అవకాశం ఉంది. ఆయా వ్యాపారాన్ని బట్టి లైసెన్స్ ఫీజు చెల్లించాలి. కనీస ఫీజు రూ. 1000 నుండి ప్రారంభం కానుంది. టీ స్టాల్ నుండి రెస్టారెంట్ వరకు పోలీస్ లైసెన్స్ తీసుకోవాల్సిందే. ప్రతి ఏటా ఏప్రిల్ మాసంలో పోలీస్ లైసెన్స్ జారీ చేయనున్నారు. ఈ ఏడాది లైసెన్స్ తీసుకొంటే వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆ లైసెన్స్ అమల్లో ఉంటుంది. ప్రతి ఏటా లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకోవాల్సి ఉంటుంది. పోలీస్ లైసెన్స్ కు సంబంధించి వ్యాపారులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. hyderabadpolice.gov.in వెబ్ సైట్ లో ధరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.